15 త‌ర్వాత వ‌ర్షాలు

Telangana weather report: తెలంగాణ వాతావ‌ర‌ణ శాఖ రైతుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 15 త‌ర్వాత వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని స్ప‌ష్టం చేసింది. 13 రోజులుగా వ‌ర్షాలు ప‌డ‌టం లేదు. దీంతో వేడి పెరిగి జ‌నం ఇబ్బంది ప‌డుతున్నారు. రైతులు వ‌ర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌రో మూడు రోజుల త‌ర్వాత వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వెల్ల‌డించిన నేప‌థ్యంలో రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ఏడాది సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదువుతుండ‌గా, 13 రోజులుగా వ‌ర్షాలు లేక ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. జులై చివర్లో భారీ వర్షాలు కురువగా రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆగస్టు ప్రారంభం నుంచి కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు మినహా భారీ వర్షాలు కుర‌వ‌డం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.

ఆగస్టు 15 తర్వాత వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమవుతుందని.. ఒకట్రెండు రోజుల్లో మరింతగా మేఘాలు అల్లుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు వెల్ల‌డించారు. ఆగస్టు 15 నుంచి తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రకు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని.. అక్కడక్కడా మాత్రమే చిరుజల్లులు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక ద్రోణి అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు కొనసాగుతోంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయన్నారు. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like