రైతు ప్రాణం మీద‌కు తెచ్చిన న‌కిలీ విత్త‌నాలు

-మంద‌మ‌ర్రి వ్యాపారిని అదుపులోకి తీసుకున్న నెన్న‌ల పోలీసులు
-అత‌ను చెప్పిన జాబితా ప్ర‌కారం రైతుల ఇండ్ల‌ల్లో సోదాలు
-అవ‌మానం త‌ట్టుకోలేక ఓ రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
-సూత్ర‌ధారుల‌ను వ‌దిలేసి అమ‌యాకుల‌ను ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళ‌న‌
-కోట్ల‌లో వ్యాపారం చేసే వారిపై దృష్టి సారించాల‌ని ఆగ్ర‌హం

మంచిర్యాల : న‌కిలీ ప‌త్తివిత్త‌నాలు రైతు ప్రాణం మీద‌కు తెచ్చాయి. న‌కిలీ విత్త‌నాలు కొనుగోలు చేశార‌నే నెపంతో పోలీసులు స్టేష‌న్ పిలిపించ‌డంతో అవ‌మానం భ‌రించ‌లేక మంచిర్యాల జిల్లా నెన్న‌ల మండ‌లానికి చెందిన రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. కోట్ల‌లో వ్యాపారం చేసే వారిని వ‌దిలేసి త‌మ‌పై ప్ర‌తాపం చూప‌డం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. సూత్ర‌ధారుల‌ను ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు.

మంచిర్యాల జిల్లా నెన్న‌ల మండ‌లానికి చెందిన పోలీసులు నాలుగు రోజుల కిందట మంద‌మ‌ర్రికి చెందిన ఓ వ్యాపారిని న‌కిలీ విత్త‌నాల వ్య‌వ‌హారంలో అదుపులోకి తీసుకున్నారు. త‌ను ఎక్క‌డెక్క‌డ అమ్మింది..? ఎవ‌రికి ఎన్ని విత్త‌నాలు ఇచ్చారు..? అనేది జాబితా తీసుకుని పోలీసులు రైతుల ఇండ్ల‌లో సోదాలు నిర్వ‌హించారు. దాదాపు 20 మంది రైతుల ఇండ్ల‌లో సోదాలు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ప‌లువురు రైతుల‌ను ప్ర‌శ్నించారు. ఇదే స‌మ‌యంలో నెన్న‌ల మండ‌లం నందుల‌ప‌ల్లికి చెందిన ఇందూరి అంకయ్య రైతును స్టేష‌న్ పిలిపించారు. దీంతో ఆయ‌న అవ‌మానం భ‌రించ‌లేక పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో అత‌న్ని 108 ద్వారా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

సూత్ర‌ధారుల‌ను వ‌దిలేసి రైతుల‌పై ప్ర‌తాపం..
పోలీసులు అస‌లు సూత్ర‌ధారులను వ‌దిలేసి వాటిని కొన్న రైతులపై ప్ర‌తాపం చూపుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నిజానికి కొన‌డం రైతుల‌ది త‌ప్పే. కానీ, అమ్మ‌కాల‌పై నిఘా పెట్టి సూత్ర‌ధారుల‌ను ప‌ట్టుకుంటే అక్క‌డే 70 నుంచి 80 శాతం వ‌ర‌కు క‌ట్ట‌డి జ‌రుగుతుంది. ఎక్క‌డ ఎవ‌రు అమ్ముతున్నార‌నే విష‌యం పోలీసుల‌కు పూర్తి స్థాయిలో స‌మాచారం ఉంద‌ని రైతులు చెబుతున్నారు. కోట్ల‌లో వ్యాపారం చేసే వారిని వ‌దిలేసి త‌మ‌ను బ‌లి చేస్తున్నార‌ని రైతులు ఆరోపిస్తున్నారు. బీమిని మండ‌లానికి చెందిన ఓ ప్ర‌జాప్ర‌తినిధి త‌న అల్లుడి ద్వారా కోట్లాది రూపాయ‌ల విలువైన న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు అమ్మించార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. అయినా, అటు వైపు దృష్టి సారించ‌లేదు. కొన్ని చోట్ల‌నైతే ఏకంగా స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఈ అమ్మ‌కాలు సాగించారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

మంద‌మ‌ర్రిలో ఆ ఇద్ద‌రు…
మంద‌మ‌ర్రి ప్రాంతానికి చెందిన ఓ మ‌హిళ‌తో పాటు, మ‌రో వ్య‌క్తి గ‌తంలో నెన్న‌ల ప్రాంతంలో భూములు లీజుకు తీసుకున్నారు. వీరిద్ద‌రూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే. వీరు ఈ ప్రాంతంలో త‌మ‌కు ఉన్న ప‌రిచ‌యాల‌తో కోట్ల రూపాయ‌లు విలువైన న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు అమ్మేశారు. తీరా అన్ని అమ్మేసిన త‌ర్వాత తీరిగ్గా ఇప్పుడు ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. అమ్మే స‌మ‌యంలోనే నిఘా పెడితే బాగుండేద‌ని ప‌లువురు చెబుతున్నారు. బీమిని మండ‌లంలో సైతం ఓ చోట క్వింటాళ్ల కొద్దీ ప‌త్తి విత్త‌నాలు ఉన్నాయ‌ని పోలీసు అధికారుల‌కు స‌మాచారం ఇచ్చినా వారు క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది. అధికార పార్టీ నేత‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కావ‌డంతో చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి.

ఇప్ప‌టికైనా పోలీసు అధికారులు ఎవ‌రైతే స‌ర‌ఫ‌రా చేశారో వారిని ప‌ట్టుకుని కేసులు పెడితే త‌ప్ప ఈ న‌కిలీ విత్త‌నాల దందా ఆగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు కింది స్థాయి పోలీసు సిబ్బంది సైతం త‌మ‌కు స‌మాచారం ఉన్నా పై వ‌ర‌కు వెళ్ల‌నివ్వ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అలా కాకుండా ఉన్న‌త స్థాయి అధికారులే దీనిపై దృష్టి సారిస్తే ఫ‌లితం ఉంటుంద‌ని చెబుతున్నారు. కింది స్థాయి రైతుల‌ను వేధించ‌డం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని ప‌లువురు స్ప‌ష్టం చేస్తున్నారు. అదే సమ‌యంలో ఈ న‌కిలీ విత్త‌నాల విష‌యంలో రైతుల‌కు పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like