రైతుల క‌ల నెర‌వేరుస్తాం..

నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఎక‌రాకు సాగునీరు - బీజేపీ నాయ‌కులు దుష్ప్ర‌చారం చేస్తున్నారు - ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్

హైద‌రాబాద్ – రైతుల క‌ల నెర‌వేరుస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ అన్నారు. మంగ‌ళ‌వారం ఎర్రమంజిల్ లోని జలసౌధ భవనంలో ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్‌రావుతో స‌మావేశ‌మ‌య్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చెన్నూరు నియోజకవర్గానికి సాగునీరు అందించే చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై ఆయ‌న‌తో మాట్లాడారు. నియోజకవర్గంలోని లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నియోజకవర్గంలోని 300 పైగా చెరువులు మత్తడి దూకేలా డిజైన్ రూపొందించామన్నారు. అనుకున్న సమయంలో సర్వే పనులు పూర్తి చేసిన ఆర్‌వీ సంస్థ ప్రతినిధులను విప్ సుమ‌న్ అభినందించారు. ప్రధాన కాలువలు 60 ఫీట్ల వెడల్పుతో ఉండేలా రూపొందించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇప్పటికే డీపీఆర్ సిద్ధ‌మ‌య్యింద‌ని పాలనాపరమైన అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీ మురళీధర్ రావును కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో జరిగిన సమావేశంలో ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వ‌చ్చింద‌న్నారు. అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వీలైనంత త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంద‌న్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో విరివిగా పండించనున్న ఉన్న ఆయిల్ పామ్ తోటల డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థకు అనుకూలంగా మారుతుంద‌న్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామ‌నిస్ప‌ష్టం చేశారు. వచ్చే రెండేళ్లలో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి దశాబ్దాల చెన్నూర్ రైతుల స్వప్నం నెరవేరుస్తామ‌న్నారు. చెన్నూరు రైతుల‌కు లబ్ధి చేకూరేలా రూపొందించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై కొంతమంది బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం దురదృష్టకరమ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎవరెన్ని విమర్శలు చేసినా రానున్న రెండేళ్లలో చెన్నూరు భూములను సస్యశ్యామలం చేయడానికి అహర్నిశలు కష్టపడతామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like