రైతుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం

బీజేపీ కేంద్రప్రభుత్వం దిగిరావాలి
రైతుల వడ్లు కొనిపిస్తామన్న బండి సంజయ్ కనిపించడం లేదు
14 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి?
బీజేపీ నాయకులను రోడ్ల మీద తిరగకుండా చేస్తాం
లక్షెట్టిపేట్ సభలో TRS అధ్యక్షుడు బాల్క సుమన్

లక్షెట్టిపేట్: తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మరో భారీ ఉద్యమానికి టీ ఆర్ ఎస్ సిద్ధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్సారార్ గార్డెన్స్ రైతుల ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వ వైఖపై టీ ఆర్ ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరి కొనుగోలులో దేశంలోని పంజాబ్,హర్యానలకు న్యాయం తెలంగాణ కు ఒక న్యాయమా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.గతంలోనే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రత్యాన్మయ పంటలు వేయాలని చెప్పినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతుల తప్పు దోవ పట్టించేలా వరి సాగు చేయాలని ఇప్పుడు పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. కేంద్రప్రభుత్వం తో వరి ధాన్యం కొనుగోలు చేపించే సత్తా బీజేపీ ఎంపీ లకు లేదని మండిపడ్డారు. తెలంగాణ లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న 14 కోట్ల ఊసే లేదని దుయ్యబట్టారు. మతం,ప్రాంతం పేరుతో బీజేపీ నాయకులు ప్రజల భావోద్వేగాలతో పబ్బం గడుపుతున్నారన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల వరి ధాన్యం కొనుగోలు విషయంలో దిగి రావాలని లేకపోతే తెలంగాణా రాష్ట్ర సాధన తరహాలో మరో భారీ ఉద్యమాన్ని చేపడతామని బీజేపీ నాయకులను హెచ్చరించారు.అంతకుముందు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని,బీజేపీ నాయకుల విషపు వలలో రైతన్నలు పడవద్దని హితవు పలికారు. ఎన్నో సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు రైతుల ఉసురుపోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ…. బీజేపీ, కాంగ్రెస్ లు తోడుదొంగలని దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు.తెలంగాణ లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఎక్కడ లేవన్నారు.గుజరాత్ కంటే తెలంగాణ ఎన్నో రెట్లు అభివృద్ధి ని సాధించిన విషయం బీజేపీ నాయకులకు తెలియదా? అని ప్రశ్నించారు. కనీస మద్దతు ధర ఇవ్వలేని కేంద్రం రైతుల పాలిట శాపంగా మారిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని జ్యోస్యం చెప్పారు. అంతకుముందు పలు మండలాల నాయకులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్,మున్సిపల్ చైర్మన్ లు కాంతయ్య,పెంట రాజయ్య,ప్రభాకర్, టీ ఆర్ ఎస్ పట్టణ,మండలాధ్యకులు పాదం శ్రీనివాస్, చుంచు చిన్నయ్య, మాజీ డీసీఎంఎస్ శ్రీనివాస్ రెడ్డి,దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like