రాష్ట్రంలో మ‌రో 8 మెడిక‌ల్ కాలేజీలు

- ప‌రిపాల‌న అనుమ‌తులు జారీ చేసిన ప్ర‌భుత్వం

జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మరో 8 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, అనుబంధ దవాఖానల అప్‌గ్రేడేషన్ కు ప‌రిపాల‌న అనుమ‌తులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్ నగర్ , నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ప్రారంభించింది. దీంతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా జరుగుతున్నది. రెండో విడుత‌గా మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. తాజాగా మూడో విడుత‌గా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కాలేజీలో 100 ఎంబీబీఎస్‌ సీట్లకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. కాలేజీ భవనాల నిర్మాణాలను ఆర్‌ అండ్‌ బీ శాఖకు అప్పగించింది. హాస్పిటల్‌ భవనాల అప్‌గ్రేడింగ్‌, పరికరాలు, ఫర్నిచర్‌ కొనుగోలు బాధ్యతలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి అప్పగించారు. ఆయా మెడికల్‌ కాలేజీలకు అటాచ్‌ చేస్తున్న హాస్పిటల్‌ను వైద్యవిధాన పరిషత్తు పరిధి నుంచి డీఎంఈ పరిధికి బదిలీ చేశారు. ఈ 8 మెడికల్ కాలేజీలను మొత్తం రూ. 1479 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లా సీట్ల సంఖ్య కేటాయింపులు
రాజన్న సిరిసిల్ల 100 రూ.166 కోట్లు
వికారాబాద్‌ 100 రూ.235 కోట్లు
ఖమ్మం 100 రూ.166 కోట్లు
కామారెడ్డి 100 రూ.235 కోట్లు
కరీంనగర్‌ 100 రూ.150 కోట్లు
జయశంకర్‌ భూపాలపల్లి 100 రూ.168 కోట్లు
కుమ్రంభీం ఆసిఫాబాద్‌ 100 రూ.169 కోట్లు
జనగాం 100 రూ.190 కోట్లు

Get real time updates directly on you device, subscribe now.

You might also like