రాష్ట్ర నిర్ల‌క్ష్య‌మే నిండా ముంచింది…

సింగ‌రేణి బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యం చూపిందా…? స‌మ‌స్య తీవ్రత పీక‌ల మీద‌కు వ‌చ్చే వ‌ర‌కు తెలియ‌లేదా..? మ‌రి సంస్థ సీఅండ్ఎండీ ఏం చేశారు..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌న్నీ తెరపైకి వ‌స్తున్నాయి. నిజంగా రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే ఇంత దూరం తీసుకువ‌చ్చాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి…

బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. వాటికి సంబంధించిన బిడ్లు ఎవ‌రూ వేయ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతానికి ప్ర‌మాదం త‌ప్పినా ముందు ముందు మ‌ళ్లీ అది తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనిపై కేంద్రానిదే త‌ప్పు అని కార్మిక సంఘాలు అన్నీ దుయ్య‌బ‌ట్టాయి. చివ‌ర‌కు మూడు రోజుల పాటు స‌మ్మె కూడా చేశాయి. ఐదు జాతీయ కార్మిక సంఘాలు, తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ముందుండి స‌మ్మె న‌డిపించాయి. స‌మ్మె విజ‌య‌వంతం కూడా అయ్యింది. అయితే ఇప్పుడు ఆ బొగ్గు బ్లాక్ ల వేలం గురించి పెద్ద ఎత్తున ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఇందులో కేంద్రం త‌ప్పు ఎంత ఉందో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ప్పు కూడా అంతే ఉంద‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. ప్ర‌మాదాన్ని ముందే ఊహించ‌కుండా స‌మ‌యం వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రం మేలుకొంద‌ని అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం, సింగ‌రేణి సీఅండ్ఎండీ నిర్ల‌క్ష్యంపై దుయ్య‌బ‌డుతున్నారు.

2015లో మిన‌ర‌ల్స్ డెవ‌ల‌ప్మెంట్ అండ్ రెగ్యులేష‌న్ యాక్ట్ కు స‌వ‌ర‌ణ చేప‌ట్టారు. అప్పుడు సాక్షాత్తు స‌భ‌లో ఎంపీగా క‌విత ఉన్నారు. దీనికి ఆమె పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తు ఇచ్చారు. ఆ బిల్లులోనే బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీక‌ర‌ణ అంశం ఉంది. ఆమె సాక్షిగా ఈ బిల్లు మ‌ద్ద‌తు పొందింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే దాదాపు ఏడేండ్లుగా ఆ అంశం న‌డుస్తూనే ఉంది. కాంగ్రెస్ హ‌యాంలోనే ఈ బొగ్గు బ్లాక్‌ల అంశం న‌డిచింది. ఆ మ‌సి ఆ ప్ర‌భుత్వాన్ని చాలా ఇరుకున పెట్టింది. అప్ప‌టి నుంచి ఈ బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీక‌ర‌ణ అంశం నానుతూ వస్తోంది. ఇప్పుడు కేంద్రం దానిని బ‌య‌ట‌కు తీసి బొగ్గు బ్లాక్‌ల‌ను వేలం వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇన్నేండ్లుగా దానిపై ప‌ట్టించుకోని రాష్ట్ర ప్ర‌భుత్వం వేలం ప్రక్రియ వ‌చ్చే స‌రికి అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేసింది.

మ‌రి ఇన్ని రోజులు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం చేస్తున్న‌ట్లు..? దానిపై కేంద్రంతో మాట్లాడాలి. బొగ్గు గ‌నుల శాఖ మంత్రి, కార్య‌ద‌ర్శి ఇలా అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపితే ఖ‌చ్చితంగా దానిపై స్ప‌ష్ట‌త వ‌చ్చేది. ఇప్పుడు కేసీఆర్‌, టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్న‌ట్లు కేంద్రం కొన్ని రాష్ట్రల్లో ఆయా రాష్ట్రల‌కు బొగ్గు బ్లాక్‌ల‌ను కేటాయించింది. ఎందుకు..? ఎప్పుడు..? కేటాయించిందంటే ఆయా రాష్ట్రల ప్ర‌భుత్వాలు దానిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి వారు చ‌ర్చ‌లు, ఉత్త‌ర‌, ప్ర‌త్యుత్త‌రాలు జ‌రిపిన త‌ర్వాతే వాటిని కేటాయించారు. మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి అలాంటిదైమేనా జ‌రిగిందా…? స‌మాధానం మాత్రం శూన్యం. కేంద్రం త‌న‌కు తానుగా వ‌చ్చి వాటిని కేటాయించ‌దు క‌దా..? మ‌రి రాష్ట్రం ఇంత నిర్ల‌క్ష్య వైఖ‌రితో ఎందుకు ఉన్న‌ట్లు.

ఇక ఆ సంస్థ సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఇంత పెద్ద సంస్థ‌కు సీఅండ్ఎండీగా ఉన్న ఆయ‌న ఇలాంటి పెద్ద పెద్ద విష‌యాలు ప్ర‌భుత్వం దృష్టికి ఎందుకు తీసుకుపోలేదు..? ముఖ్య‌మంత్రితో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించే ప్ర‌య‌త్నాలు ఎందుకు చేయ‌లేదు అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఆయ‌న చేసిన త‌ప్పిదం వ‌ల్ల సింగ‌రేణి సంస్థ భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వ‌చ్చేది. ఆయ‌న కేంద్రం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే స‌మావేశాల‌కు అస‌లే వెళ్ల‌ర‌నే అప‌వాదు ఉంది. ఒకానొక ద‌శ‌లో సింగ‌రేణి డైరెక్ట‌ర్ (పా)ను ఎప్పుడు మీరే స‌మావేశాల‌కు వ‌స్తారు..? మీ సీఅండ్ఎండీ ఎందుకు రార‌ని నిల‌దీసిన సంద‌ర్భాలు కూడా ఉన్న‌ట్లు చెబుతారు. ఎంత చేసినా సింగ‌రేణి సంస్థ‌లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వాటా ఉంటుంది. స‌మావేశాల ద్వారా సింగ‌రేణికి సంబంధించిన ఎన్నో అంశాలు ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. సింగ‌రేణికి సంబంధించి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు, బొగ్గు కేటాయింపులు ఎన్నో అంశాలు కేంద్రం ప‌రిధిలో ఉంటాయి. సంస్థ సీఈవో అయిన శ్రీ‌ధ‌ర్ స‌మావేశాలు వెళ్ల‌కుండా ఉండ‌టం వ‌ల్ల నెగెటివ్ ఫీలింగ్ వ‌స్తుంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా అంత పెద్ద సంస్థ‌కు సీఅండ్ఎండీ గా ఉన్న ఆయ‌న ఇంత నిర్ల‌క్ష్యంగా ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ఇక ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ్మెకు రెండు రోజుల ముందు ప్ర‌ధాన మంత్రికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీక‌రణ విష‌యంలో ఆయ‌న చేసిన ప‌ని అదొక్క‌టే కావ‌చ్చు. మ‌రి అలా లేఖ రాయ‌గానే బొగ్గు బ్లాక్ లు కేటాయిస్తారా..? తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం చాలా ప్లాన్‌గా స‌మ్మె చేయించింది. దీనికి సింగ‌రేణి సంస్థ కూడా పూర్తిగా స‌హ‌క‌రించింది. ఎప్పుడు స‌మ్మె జ‌రిగినా చివ‌రికి లూజ్ కోల్ ఎత్తించి ఇంత ఉత్ప‌త్తి జ‌రిగింద‌ని చూపించే సంస్థ బొగ్గు పెళ్ల కూడా బ‌య‌ట‌కు వెళ్ల‌లేద‌ని చెప్పింది. ఇక టీబీజీకేఎస్ ఉచ్చులో మిగ‌తా కార్మిక సంఘాలు ప‌డ్డాయి. కేంద్రాన్ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసిన జాతీయ కార్మిక సంఘాలు రాష్ట్ర ప్ర‌భుత్వానిది కూడా త‌ప్పుంది అనే విష‌యం చెప్ప‌లేకపోయాయి.

ఇక భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ నేత‌లు రెండు రోజుల కింద‌ట కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషిని క‌లిసి సింగ‌రేణిపై చ‌ర్చించారు. దాంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చాలా ఆశ్చ‌ర్యం క‌లిగించాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బొగ్గు బ్లాక్‌ల విష‌యంలో రాష్ట్రం త‌మ‌ను సంప్ర‌దించ‌లేద‌ని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో మంత్రుల‌ను ఢిల్లీకి పంపి ఆయ‌న సైతం ఢిల్లీకి వెళ్లి అపాయింట్‌మెంట్ లేకుండా తిరిగి వ‌చ్చారు. మ‌రి సింగ‌రేణిలో విష‌యంలో అలాంటి చిత్త‌శుద్ధి ఏమైంద‌ని కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు. బొగ్గు బ్లాక్ ల వేలానికి సంబంధించి కంపెనీలు ఏవీ రాలేదు కాబ‌ట్టి స‌రిపోయింది… లేక‌పోతే సంస్థ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారేది. ఇప్ప‌టికైనా ఈ విష‌యంలో అటు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి, ఇటు సంస్థ నుంచి ఏవైనా చ‌ర్య‌లు ఉంటాయో…? లేదో వేచి చూడాలి.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like