రాష్ట్రప‌తి ఫ్లెక్సీల తొల‌గింపు వివాదం

-పోలీసులు ద‌గ్గ‌రుండి తీసేయించార‌ని బీజేపీ ఆరోప‌ణ‌
-పోలీసుల‌తో పాయ‌ల శ‌ర‌త్ వాగ్వాదం
-రోడ్డుపైనే బైఠాయించిన నేత‌లు
-ఆందోళ‌న త‌ర్వాత ఫ్లెక్సీ పెట్టించిన ఖాకీలు

ఆదిలాబాద్ : రాష్ట్రప‌తి ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను కొంద‌రు వ్య‌క్తులు తొల‌గించ‌డంతో బీజేపీ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. పోలీసులు వాటిని ద‌గ్గ‌రుండి తీసేయించార‌ని బీజేపీ ఆరోపించ‌గా, త‌ర్వాత ఖాకీలే ద‌గ్గ‌రుండి వాటిని ఏర్పాటు చేయ‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.

రాష్ట్రప‌తిగా ద్రౌప‌ది ముర్ము సోమ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేత‌లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, వాళ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బోర్డు అంత‌కుముందే కొంద‌రు వ్య‌క్తులు రిజ‌ర్వ్ చేసి పెట్టుకున్నారు. వారు ఆ ఫ్లెక్సీ తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో బీజేపీ నేత‌లు అడ్డుకున్నారు. ఆ వ్య‌క్తి పోలీసుల‌కు ఫోన్ చేసి బీజేపీ నేత‌లు త‌మ‌పై దాడికి ప్ర‌య‌త్నిస్తున్నారంటూ చెప్పారు. వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. అక్క‌డ ఫ్లెక్సీల‌ను తొల‌గించారు.

దీంతో, పోలీసులు ద‌గ్గ‌ర ఉండి మ‌రీ త‌మ ఫ్లెక్సీల‌ను తొల‌గించార‌ని బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. పాయ‌ల శ‌ర‌త్ పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. స్టేష‌న్‌కు వ‌చ్చి ఫిర్యాదు చేస్తేనే ప‌ట్టించుకోని పోలీసులు కేవ‌లం ఒక్క ఫోన్‌కాల్‌తో ప‌రిగెత్తుకుని వ‌చ్చి మ‌రీ ద‌గ్గ‌రుండి ఫ్లెక్సీల‌ను తొల‌గించార‌ని మండిప‌డ్డారు. ఆ ఫ్లెక్సీలు తిరిగి ఏర్పాటు చేసే వ‌ర‌కు ఆందోళ‌న చేస్తామ‌ని రోడ్డుపై బైఠాయించారు. కొద్దిసేపు అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు పాయ‌ల శంక‌ర్ అక్క‌డికి వ‌చ్చి ఆందోళ‌న‌లో కూర్చున్నారు. పోలీసులు వారికి న‌చ్చ‌జెప్పి తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దీంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like