TSRTCకి రికార్డు ఆదాయం

TSRTC Record Revenue: పండుగ పూట టీఎస్‌ఆర్టీసీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. రాఖీపౌర్ణ‌మి రోజు సంస్థ‌కు పెద్ద ఎత్తున ఆదాయం స‌మ‌కూరింది. గురువారం ఒక్కరోజే సంస్థ‌కు రూ.22.65 కోట్ల ఆదాయం వచ్చింది. రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. సిబ్బంది పనితీరు ప్ర‌శంసిస్తూ సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు అని ఆయన తెలిపారు.

ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో లేని విధంగా ఒక్క రోజులో రూ.22.65 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. గత ఏడాది రాఖీ పండుగ రోజు 12 డిపోలు మాత్రమే 100 శాతానికిపైగా ఓఆర్ సాధించగా.. ఈసారి 20 డిపోలు ఆ ఘనత నమోదు చేశాయి. రాఖీ పండుగ కోసం టీఎస్‌ఆర్టీసీ 3000లకు పైగా ప్రత్యేక బస్సులను నడిపింది. కేవ‌లం ఒక్క రోజే సంస్థకు రూ. 22.65 కోట్ల ఆదాయం స‌మ‌కూర‌డం గ‌మ‌నార్హం. గత ఏడాది రాఖీ పండుగ రోజు రూ. 21.66 కోట్ల ఆదాయం సమకూరగా ఈసారి అదనంగా దాదాపు కోటి రూపాయలు అద‌నంగా సంస్థ ఆర్జించింది. ఈ రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాది కంటే లక్ష మంది అదనంగా రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గత ఏడాదితో పోల్చితే ఈసారి రాఖీ పండుగకు 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 2022లో రాఖీ పండగ రోజు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా.. ఈసారి 36.77 లక్షల కి.మీ. నడిచాయి. ఇక 20 డిపోల్లో 100 శాతానికి పైగా యాక్యుపెన్సీ రేషియో నమోదైంది.

ఆక్యూపెన్సీ రేషియా విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా గత ఏడాది రికార్డును అధిగమించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2022లో రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈసారి 104.68 శాతం ఓఆర్ నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్‌పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికి పైగా ఓఆర్ సాధించాయి. నల్గొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాఖీ పౌర్ణమికి అత్యధికంగా 97.05 శాతం ఓఆర్ నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కి పైగా ఓఆర్ సాధించడం విశేషం. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైనట్లు సజ్జనార్ తెలిపారు.

‘ప్రజలందరూ పండుగలు చేసుకుంటుంటే.. సంస్థ సిబ్బంది విధుల్లో నిమగ్నై వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అందుకు రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నారు. సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, దసరా తదితర ప్రధాన పండుగల్లో సిబ్బంది త్యాగం ఎనలేనిది. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజల ఆదరణ, ప్రోత్సాహన్ని స్ఫూర్తిగా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పని చేసి భవిష్యత్‌లోనూ మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలందించాలి. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ నమ్మకాన్ని కొల్పోకుండా మంచి ఫలితాలు వచ్చేలా పాటుపడాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like