పైస‌ల వ‌సూళ్లపై ఆర్జేడీ విచార‌ణ‌

-అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌ను విచారించిన అధికారి
-‘నాంది న్యూస్’ క‌థ‌నానికి స్పంద‌న
-ప‌లు స‌మ‌స్య‌లు వివ‌రించిన యూనియ‌న్ నేత‌లు

అంగ‌న్‌వాడీలో పైస‌ల వ‌సూళ్లపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై శ‌నివారం వ‌రంగ‌ల్ ఆర్జేడీ ఝాన్సీరాణి విచార‌ణ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె అంగ‌న్‌వాడీ టీచర్ల‌ను పూర్తి స్థాయిలో విచారించారు. మీరు ఎవ‌రికైనా డ‌బ్బులు ఇచ్చారా..? యూనియ‌న్ నేత‌లు, సీడీపీవో, సూప‌ర్‌వైజ‌ర్లు ఎవ‌రైనా మిమ్మ‌ల్ని డ‌బ్బులు డిమాండ్ చేశారా..? అంటూ ప్ర‌శ్నించారు. అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌ను విడివిడిగా పిలిచిన ఆర్జేడీ వారిని అన్ని ర‌కాలుగా ఆరా తీశారు. రెండు రోజుల కింద‌ట అంగ‌న్‌వాడీలో పైస‌ల వ‌సూళ్ల క‌ల‌కలం పేరుతో ‘నాంది న్యూస్’లో క‌థ‌నం వ‌చ్చింది. దీనిపై స్పందించిన ఆర్జేడీ ఈ విచార‌ణ నిర్వ‌హించారు. అన్ని కోణాల్లో విచార‌ణ జ‌రిపిన ఆమె దానికి సంబంధించిన నివేదిక ఉన్న‌తాధికారుల‌కు అందించ‌నున్నారు.

ఈ సంద‌ర్బంగా ఆంగ‌న్‌వాడీ యూనియ‌న్ బీఆర్టీయూ సంఘం ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా సంక్షేమాధికారి కార్యాల‌యంలో మంచిర్యాల ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు స‌క్ర‌మంగా చేయ‌డం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెన్నూరు మున్సిపాలిటీలో అద్దె రూ. 2,000 చెల్లిస్తుండ‌గా, న‌స్పూరు మున్సిపాలిటీలో అద్దె కేవ‌లం రూ. 1,000 ఇస్తున్నార‌ని అన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో ఇచ్చిన విధంగానే న‌స్పూరు మున్సిపాలిటీలో కూడా ఇవ్వాల‌ని కోరారు. ఆరోగ్య‌లక్ష్మి బిల్లుల విష‌యంలో కొన్ని ప్రాజెక్టుల్లో ఒక ర‌కంగా, మ‌రికొన్ని ప్రాజెక్టుల్లో మ‌రొర‌కంగా ఇస్తున్నార‌ని ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఒకే జిల్లాలో ఆరోగ్యల‌క్ష్మి బిల్లులు వేర్వేరుగా వ‌స్తున్నాయ‌ని ఈ తేడాలు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఏవైనా ప్ర‌భుత్వ కార్యక్ర‌మాలు కానీ, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు నిధులు వ‌స్తున్నా మాకు ఇవ్వ‌డం లేద‌ని, సొంతంగా ఖ‌ర్చు చేసుకోవాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు. జిల్లాలో ఆయా పోస్టులు దాదాపు 42 వ‌ర‌కు ఖాళీగా ఉన్నాయ‌ని వాటిని భ‌ర్తీ చేయాల‌ని కోరారు. టీచ‌ర్ల బ‌దిలీలు సైతం ఆపేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాలేజీ రోడ్డులో ఉన్న సీడీపీవో కార్యాల‌యం అందుబాటులో లేకుండా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, త‌మ‌కు అందుబాటులో ఉండేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఆర్జేడీని క‌లిసిన వారిలో బీఆర్టీయూ సంఘం రాష్ట్ర స‌భ్యురాళ్లు పిరిసింగుల సురేఖ‌, ఎన్‌.అరుణ‌, నాయ‌కురాళ్లు ప‌ద్మావ‌తి, రేణుకాదేవి, క‌లికుంట్ల తిరుమ‌ల‌, వై.కుసుమ‌కుమారి, కాంత‌కృష్ణ‌, శ్రీ‌లక్ష్మి, నాగ‌రాణి, ప‌ద్మ‌, సంధ్యారాణి, శార‌ద‌ త‌దిత‌రులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like