రోగుల త‌ర‌లింపు..

-మాతా శిశు సంరక్ష‌ణా కేంద్రం నుంచి ప్ర‌ధాన ఆసుప‌త్రికి
-వ‌ర‌ద ముంపు పొంచి ఉండంతో నిర్ణ‌యం

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో మాతా శిశు సంర‌క్ష‌ణా కేంద్రం నుంచి రోగుల‌ను త‌ర‌లించారు. గోదావ‌రి వ‌రద ఉధృతి పెరిగిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మాతా శిశు సంర‌క్ష‌ణా కేంద్రం గోదావ‌రి ఒడ్డునే ఉంటుంది. ఎల్లంప‌ల్లి ప్రాజెక్టుకు వ‌ర‌ద భారీగా వ‌స్తున్న నేప‌థ్యంలో గేట్లు ఎత్తారు. వ‌రద ఉధృతి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. వ‌ర‌ద పెరిగితే ఖ‌చ్చితంగా అది మాతా శిశు సంర‌క్ష‌ణా కేంద్రానికి చేరుకుంటుంది. ఈ నేప‌థ్యంలో రోగుల‌ను త‌ర‌లిస్తున్నారు.

కోట్లాది రూపాయ‌ల ప్ర‌జా ధ‌నం వెచ్చింది భ‌వ‌నాలు నిర్మిస్తున్న అధికారులు వాటి గురించి క‌నీసం ఆలోచించ‌క‌పోవ‌డం ప‌ట్ల ప‌లువురు ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మంచిర్యాల పట్టణానికి ఎగువనే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది. అటు కాలేశ్వరం జలాలు, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ఉధృతితో, నీరంతా మంచిర్యాల కాలేజీ రోడ్ ఏరియా, ఎన్టీఆర్ నగర్ ను ముంచెత్తుతుంది. వరద ఉధృతి పెరుగుతున్న ప్రతీసారి నీటి ప్రవాహం పెరుగుతూ మాతా శిశు సంర‌క్ష‌ణా భవనంలోకి నీరు చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన ప్రతీసారి వరద ప్రవాహం పెరిగి నేరుగా ఈ కేంద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి మరింత పెరిగితే ఎల్లంపల్లి గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తేస్తే, ఈ భవనం నీట మునిగే ప్రమాదం ఉంది. అయినా అధికారులు ఈ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా గోదావరి ఒడ్డున నిర్మించడం ఏమిటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా వ‌ర‌ద‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి రోగుల‌ను త‌ర‌లిస్తే ప‌రిస్థితి ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి పూర్తి స్థాయి ప్ర‌త్యామ్నాయం ఆలోచించాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like