రోవ‌ర్‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం

Chandrayaan-3 : చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న చంద్రయాన్ 3లోని రోవర్ ప్రజ్ఞాన్ కు పెను ప్రమాదమే తప్పింది. పరిశోధనల కోసం విక్రమ్ ల్యాండర్ ర్యాంప్ నుంచి బయటకు వచ్చి తిరుగుతున్న రోవర్ ప్రజ్ఞాన్ ఓ పెద్ద గోతి దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. ల్యాండర్ దిగిన ప్రదేశం నుంచి కొంచెం దూరంలోనే ఉన్న ఈ నాలుగు మీటర్ల క్రేటర్ ను వెంటనే గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్ దానికి మూడుమీటర్ల దూరంలో నిలిచిపోయింది.

చంద్రుడి ప్రజ్ఞాన్ రోవర్ కి పెను ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న మార్గంలో నాలుగు మీటర్ల వెడల్పు గల గొయ్యిని గుర్తించింది రోవర్. ఇది గమనించిన ఇస్రో శాస్త్రవేత్తలు వెంటనే అప్రమత్తమ‌య్యారు. రోవర్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు. తన మార్గాన్ని మళ్లించుకోవాలని సూచించారు. దీంతో రోవర్ తన మార్గాన్ని మళ్లించుకుంది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ సురక్షిత మార్గంలో పయనిస్తున్నదని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్రమంలో ఇస్రో ట్విట్టర్ వేదికగా.. ‘ 2023, ఆగస్టు 27న రోవర్ ముందుకు వెళ్తున్న సమయంలో మూడు మీటర్ల దూరంలో గొయ్యి కనపడింది. ఈ గొయ్యి నాలుగు మీటర్ల వెడల్పు ఉంది. దీంతో రోవర్ దిశ మార్చుకునేలా కమాండ్ ఇచ్చాం. దీంతో దిశ మార్చుకున్న రోవర్ సురక్షితంగా ముందుకు సాగుతోంద’ని ఇస్రో పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ స్థిరంగా ఉంటుంది. ల్యాండర్ చూట్టూ రోవర్ తిరుగుతూ అక్కడి సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని ల్యాండర్ కు పంపుతుంది. ఆ ల్యాండర్ నుంచి ఇస్రోకు సమాచారం అందుతుంది. ఆ డేటాను శాస్త్రీయంగా విశ్లేషించారు ఇస్రో శాస్త్రవేత్తలు.

చంద్రయాన్–3 ప్రయోగంలో భాగంగా ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ రికార్డు చేస్తున్న దృశ్యాలను ఇస్రో సోషల్ మీడియాలో పంచుకుంటోంది. తొలుత ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ జారుకుంటూ కిందకు దిగిన దృశ్యాన్ని ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనంతరం శివశక్తి పాయింట్ (విక్రమ్ ల్యాండర్ ల్యాండర్ సైట్) వద్ద రోవర్ చక్కర్లు కొట్టిన వీడియోని విడుదల చేసింది ఇస్రో. తదుపరి అందులోని ఛేస్ట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంలోని నేల ఉష్ణోగ్రతల తీరును కొలిచిన వివరాల్ని గ్రాఫ్ తో సహా ఇస్రో వెల్లడించింది.

చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి ఉపరితలంపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. అంతే కాకుండా దక్షిణ దృవంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయిన ఉత్సాహంతో … ఇస్రో సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్ 1 అనే సోలార్ మిషన్ లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులు, సౌర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడానికి గల కారణాలను విశ్లేషించేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like