రూ. 2 వేల కోట్ల ఆదాయం

-మద్యం దుకాణాల లైసెన్సుల టెండర్ల ప్రక్రియకు ముగిసిన గ‌డువు
-రాష్ట్ర వ్యాప్తంగా ఒక ల‌క్ష 7 వేల 16 ద‌ర‌ఖాస్తులు
-అత్యధికంగా సరూర్‌నగర్‌లో 8 వేల 883 దరఖాస్తులు
-అత్య‌ల్పంగా నిర్మ‌ల్‌లో 657 ద‌ర‌ఖాస్తులు
-లాటరీ ద్వారా దుకాణాల లైసెన్సులను కేటాయించనున్న క‌లెక్ట‌ర్లు

Telangana: మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సుల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన టెండర్ల ప్రక్రియ గడువు ముగిసింది. టెండర్ల దాఖలు చివరి రోజు కావడంతో శుక్రవారం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ టెండర్ల ద్వారా రాష్ట్రంలో దరఖాస్తులు లక్ష దాటాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి వచ్చే నవంబర్‌తో ముగిసిపోనుండగా మూడు నెలల ముందుగానే ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. 2023-25 కాలపరిమితికి రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేసేందుకు ఈ నెల 3న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మరుసటి రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించింది. ఇవాళ చివరి రోజు కావడంతో ఆశావాహులు దరఖాస్తులు చేసుకునేందుకు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద బారులు తీరారు.

అత్యధికంగా సరూర్‌నగర్‌లో 8 వేల 883 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఆ త‌ర్వాత 8 వేల 749 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. న‌ల్గొండ‌లో 6 వేల 134 రాగా, మేడ్చ‌ల్‌లో 5 వేల 210 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇక ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో చాలా త‌క్కువ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇందులో నిర్మ‌ల్ లో చాలా త‌క్కువ‌గా కేవ‌లం 657 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఆదిలాబాద్ 781, ఆసిఫాబాద్ 846 ద‌రఖాస్తులు మాత్ర‌మే వ‌చ్చాయి.

పాత విధానం ద్వారా ఈ సారి మద్యం దుకాణాల లైసెన్సులను ఎక్సైజ్‌శాఖ జారీ చేయనున్నది. ఇక మద్యం దుకాణాల్లో ప్రభుత్వం గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్లు కేటాయించగా.. ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు మరో ఐదుశాతం రిజర్వేషన్లు ఇచ్చింది. రాష్టవ్యాప్తంగా గీత కార్మికులకు 363, దళితులకు 262, గిరిజనులకు 131 కలిపి మొత్తం 756 మద్యం దుకాణాలు రిజర్వేషన్ల ప్రాతిపాదికన కేటాయించనుండగా.. మిగతా 1,864 మద్యం దుకాణాలు జనరల్‌ కేటగిరి కింద లైసెన్సులు జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా దుకాణాల లైసెన్సులను కేటాయించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like