సాగు చ‌ట్టాలు మ‌ళ్లీ తెస్తాం

కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను స్వల్ప మార్పులతో మళ్ళీ తీసుకొస్తామని  కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న  నాగ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన అగ్రో విజన్‌ విక్స్‌పో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ” స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో అతి పెద్ద సంస్కరణ జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన చట్టాలను సవరించి కొత్త చట్టాలను తీసుకొచ్చాం. కానీ కొందరికి  ఈ సంస్కరణలు నచ్చలేదు. అందుకే నల్ల చట్టాలుగా ప్రచారం చేసి వాటిని రద్దు చేయించారు. కానీ ప్రభుత్వం ఏం అసంతృప్తి చెందడం లేదు. మేం ఓ అడుగు వెనకడుగు వేశాం. కానీ తప్పకుండా మళ్లీ ముందడుగు వేస్తాం. ఎందుకంటే రైతులే ఈ దేశానికి వెన్నెముక ” అని అన్నారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే అవకాశాలున్నాయని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించడం గమనార్హం. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు దాదాపు ఏడాదికి పైగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో దిగొచ్చిన కేంద్రప్రభుత్వం చట్టాలపై వెనక్కి తగ్గింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించారు.  సాగు చట్టాల రద్దు ప్రకటనతో ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు వారం క్రితమే శిబిరాలను ఖాళీ చేసి వెళ్లారు.తాజాగా మంత్రి మళ్ళీ వ్యవసాయ చట్టాలను తెస్తామని తోమర్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like