స‌భ్య‌త్వంతో స‌మాధానం

-జిల్లాలో విస్తృతంగా కాంగ్రెస్ స‌భ్య‌త్వం చేయిస్తున్న ప్రేంసాగ‌ర్ రావు
-త‌నపై విమ‌ర్శ‌ల‌కు ప‌నితోనే స‌మాధానం చెప్పాల‌ని నిర్ణ‌యం
-నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో నిత్యం స‌మీక్ష‌లు
-రాష్ట్రంలోనే అధికంగా స‌భ్య‌త్వాలు చేయించాల‌ని ప్ర‌ణాళిక‌లు
-దేశంలోనే నంబ‌ర్ వ‌న్ నియోజ‌క‌వ‌ర్గంగా మంచిర్యాల
-అనుకున్న విధంగా దూసుకుపోతున్న పీఎస్ఆర్‌

మంచిర్యాల : ఆయ‌న టీఆర్ఎస్ కోవ‌ర్టు.. ఎవ‌రంటే లెక్క లేదు, పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాలి.. ఇలా ఆయ‌న‌పై ఎన్నో విమ‌ర్శ‌లు. చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే ప‌డ్డారు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు. అది కూడా త‌న ప‌నితీరు ద్వారానే. కొద్ది రోజులుగా ఆయ‌న‌ అదే ప‌నిలో చాలా బిజీగా ఉన్నారు..

కాంగ్రెస్ పార్టీలో ప్రేంసాగ‌ర్ రావు అంటే ఫైర్‌బ్రాండ్‌. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీగా చ‌క్రం తిప్పిన నేత‌. త‌న‌కు స‌రైన ప్రాధాన్య‌త లేద‌ని అనిపించినా, త‌న‌కు ఎవ‌రైనా ఎదురు వ‌స్తార‌ని భావించినా వారిని అణ‌గ‌దొక్కేవ‌ర‌కు వ‌దిలిపెట్ట‌ర‌నే పేరుంది. ఇక ఆయ‌న త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో నిత్యం వార్త‌లో ఉంటారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో త‌న రాజ‌కీయ ప్రాబ‌ల్యం కోసం ఇత‌ర నేత‌ల‌తో నిత్యం ఘ‌ర్ష‌ణ ప‌డుతుంటారు. త‌న కార్య‌క‌ర్త‌ల కోసం ఎంత దూరం అయినా వెళ్తార‌ని ఆయ‌న గురించి తెలిసిన వారు చెబుతుంటారు.

తాజాగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారారు. ఒక‌టి త‌న‌కు స‌రైన ప్రాధాన్య‌త లేద‌ని ఏకంగా హైక‌మాండ్‌కు అల్టిమేటం జారీ చేశారు. కొన్ని డిమాండ్లు పెట్టి వాటిని గ‌డువులోగా తీర్చ‌క‌పోతే తాను కొత్త పార్టీ పెట్ట‌బోతున‌ట్టు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇక పార్టీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఏకంగా పార్టీ సీనియ‌ర్ నేత వీ. హ‌న్మంత‌రావును అడ్డుకుని నినాదాలు చేశారు. వాస్త‌వానికి ఇందులో ఆయ‌న త‌ప్పేమీ లేక‌పోయినా, ఆయ‌న అనుచ‌రులు చేశారు కాబ‌ట్టి ఆయ‌నే ఘ‌ట‌న‌కు బాధ్యుడు కావాల్సి వ‌చ్చింది. దీనిని వీహెచ్ అధిష్టానం దృష్టికి తీసుకుపోవ‌డం వారు షోకాజ్ నోటీసు జారీ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

దీంతో ప్రేంసాగ‌ర్ రావు మొద‌ట సంధికి ప్ర‌య‌త్నించారు. ఆ ప్ర‌య‌త్నాలు అన్నీ విఫ‌లం అయ్యాయి. ఇక లాభం లేద‌నుకుని త‌న ప‌నితీరుతోనే స‌మాధానం చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. దానికి కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వం ఆయ‌న‌కు అందివ‌చ్చింది. ఇక తాను స్వ‌యంగా రంగంలోకి దిగి, త‌న శ్రేణుల‌ను సైతం రంగంలోకి దించారు. ఎక్క‌డా త‌గ్గ‌కుండా జిల్లావ్యాప్తంగా స‌భ్య‌త్వాలు చేయిస్తున్నారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి, టీపీసీసీ సెక్ర‌ట‌రీ పిన్నింటి ర‌ఘునాథ‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు నూక‌ల ర‌మేష్, బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి చిలుముల శంక‌ర్‌, బండి ప్ర‌భాక‌ర్‌, కంక‌తి శ్రీ‌నివాస్‌, జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత సూరం ర‌వీంద‌ర్ త‌దిత‌రులు జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో స‌భ్య‌త్వం చేయిస్తున్నారు.

ముఖ్యంగా మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో 2,54,072 ఓట‌ర్లు ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు 1,46,895 కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వాలు చేయించారు. దేశంలోనే డిజిట‌ల్ స‌భ్య‌త్వాల న‌మోదులో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచారు. బెల్లంప‌ల్లిలో 39,000 వ‌ర‌కు స‌భ్య‌త్వాలు చేయించ‌గా, అందులో 21,000 వ‌ర‌కు ప్రేంసాగ‌ర్ రావు గ్రూపు నేత‌లు స‌భ్య‌త్వాలు చేయించారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో 29,000 స‌భ్య‌త్వాల‌కు 27,200 ప్రేంసాగ‌ర్ రావు గ్రూపు నేత‌లు చేయించారు. త‌న ప‌నితీరు అధిష్టానం వ‌ద్ద నిరూపించుకునేందుకే రికార్డు స్థాయిలో స‌భ్య‌త్వాలు చేయిస్తున్నార‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే త‌న‌కు ఎదురులేద‌ని నిరూపించుకున్నారు. మ‌రి అధిష్టానం ఏ విధంగా ఆయ‌న ప‌ని తీరు గుర్తిస్తుందో చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like