9491145075

-మోసగాళ్లపై ఈ నెంబర్‌కు స‌మాచారం ఇవ్వండి
-వారిపై తక్షణమే కఠిన చర్యలు
-డైరెక్టర్‌ (పర్సనల్‌, ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్‌ స్పష్టీకరణ

కొందరు మోసగాళ్లు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల వద్ద డబ్బులు దండుకుంటున్నార‌ని, ఇటువంటి వారి సమాచారం తమ విజిలెన్స్‌ శాఖ 9491145075 నెంబర్‌కు అందించాల‌ని డైరెక్టర్‌ (పర్సనల్‌, ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్ వెల్ల‌డించారు. స‌మాచారం అందిన‌ తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణిలో ఉద్యోగ నియామకాల కోసం సింగరేణి పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తోంద‌న్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తూ ఆదర్శవంతంగా ముందుకుపోతున్నామ‌ని బ‌లరామ్ స్ప‌ష్టం చేశారు.

సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయగా దాదాపు లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని ఆయ‌న వెల్ల‌డించారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా కేవలం రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. రాత పరీక్ష మూల్యాంకం పూర్తిగా కంప్యూటర్‌ ఆధారంగా ఉంటుందని చెప్పారు. ఇంటర్వ్యూ ప్రక్రియ లేనందున అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి మానవ ప్రమేయం, రికమండేషన్‌కు ఏ మాత్రం అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కానీ కొందరు మోసగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని, రికమండేషన్లు చేస్తామని తప్పుడు మాటలు చెబుతూ నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అమాయ‌కుల వ‌ద్ద‌ డబ్బు దండుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే సింగరేణి విజిలెన్స్‌ శాఖతో పాటు పోలీసు శాఖ కూడా నిఘా వేసి ఉంచిద‌న్నారు. ఇటువంటి మోసకారుల సమాచారం తెలిసిన వారెవరైనా సరే బాధ్యత గల పౌరులుగా ఈ అక్రమార్కుల ఆటకట్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయన్న కల్లబొల్లి మాటలకు ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఇప్పటికే ఈ విధంగా ఎవరైనా డబ్బు ఇచ్చి ఉంటే, ఇచ్చిన వారు, అటువంటి సమాచారం తెలిసిన వారు వెంటనే పైన సూచించిన నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు చెప్పాల‌ని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇటువంటి నేరాలను అరికట్టే బాధ్యత సింగరేణి ప్రాంత యువత చేపట్టాలని పిలుపునిచ్చారు.

అలాగే పరీక్షల నిర్వహణ సందర్భంగా అత్యాధునిక టెక్నాలజీ గల స్కానర్లు, మెటల్‌ డిటెక్టర్లను కంపెనీ ఏర్పాటు చేస్తుందని, ఎవరైనా డిజిటల్‌ గాడ్జెట్ల ద్వారా మోసం చేయాలని చూస్తే ఈ పరీక్ష నుంచి డిబార్‌ చేయడమే కాకుండా మరెప్పుడూ పోటీ పరీక్షలకు హాజరుకాకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like