స‌మ్మె జేసుడే… సంగ‌తి జూసుడే

సింగరేణి భవన్ లో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని 72 గంటల సమ్మె కొనసాగించటానికి కార్మిక సంఘాల నిర్ణయం తీసుకున్నాయి. సింగ‌రేణిలో కార్మిక సంఘాలు స‌మ్మెకు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో శుక్ర‌వారం చ‌ర్చ‌ల‌కు రావాల‌ని యాజ‌మాన్యం కోరింది. కేంద్రం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల నాయకులు సమ్మె చేసేందుకు యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 9 నుంచి 11 వరకు సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత నెల 25న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీసు ఇవ్వగా 30న అన్ని జాతీయ కార్మిక సంఘాలతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ మేర‌కు తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం, బీఎంఎస్‌, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూతో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా సమ్మెకు కదం తొక్కనున్నాయి.

శుక్ర‌వారం సింగరేణి భవన్ లో జరిగిన చర్చల్లో అన్ని సంఘాలు ముక్తకంఠంతో బొగ్గు గనుల వేలం వేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. 9,10,11 తేదీలలో సమ్మె కొనసాగించటానికి జేఏసీ సంఘాలన్నీ ఈ నిర్ణయం తీసుకున్నాయి. శ‌నివారం అన్ని సంఘాల ఆధ్వర్యంలో సింగ‌రేణి సీఅండ్ ఎండీకి విన‌తిప‌త్రం అంద‌చేయ‌నున్నాయి. ముఖ్యమంత్రిని కూడా కలవాలని నిర్ణ‌యం తీసుకున్నారు. అదేవిధంగా ఢిల్లీలో పార్లమెంటు సభ్యులందరినీ కలిసి పార్లమెంటులో బొగ్గు బ్లాకుల ప్రైవేటీక‌ర‌ణ‌పై చ‌ర్చించాల‌ని కోర‌నున్నారు. అంతేకాకుండా వేలంపాటలో పాల్గొన్న వారి ఆఫీసుల ముందు ధర్నా చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు అంగీకారం తెలిపాయి. ఎట్టి పరిస్థితిలో సింగరేణి గనులలోకి రావద్దని వస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించాల‌ని కూడా కార్మిక సంఘాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతం కోసం కలిసొచ్చే అన్ని సంఘాలను కలుపుకుపోవాలని తీవ్రమైన ప్రతిఘటన ఉంటే తప్ప బొగ్గు గనులు వేలం అడ్డుకోవటం సాధ్యం కాదని కార్మిక సంఘ నేత‌లు స్ప‌ష్టం చేశారు. కనుక కలిసొచ్చే అన్ని సంఘాలను ఆహ్వానించి తీవ్రమైన ఉద్యమం నిర్మాణం చేపట్టాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే పటిష్టమైన ఉద్యమ నిర్మాణం అవసరం ఉందని కార్మిక సంఘాల జేఏసీ ఒక దృఢమైన సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like