సమ్మె వ‌ద్దు… ఆలోచించండి

కార్మికులతో పాటు సంస్థకు ఆర్థికంగా నష్టం - సమ్మె ఆలోచన విరమించుకోండి - బొగ్గు బ్లాక్ ల వేలం కేంద్రం విధానపర నిర్ణయం - సమ్మె కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో బ్లాక్ లను కాపాడటానికి ప్రయత్నించండి - అన్ని యూనియన్ల ప్రతినిధులతో చర్చలో సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి

సింగరేణి కార్మిక సంఘాలు ఈ నెల 9నుంచి మూడు రోజుల పాటు చేపట్ట తలపెట్టిన సమ్మెతో సంస్థ ప్రగతికి నష్టం వాటిల్లుతుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాల‌ని అన్ని కార్మిక సంఘాలకు సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో బొగ్గు బ్లాక్ ల వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై శుక్రవారం కార్మిక సంఘాల నాయకులతో సుదీర్ఘంగా ప్రత్యేక చర్చలు జరిపింది. సమ్మె వల్ల ఏమీ సాధించలేమని, ఆర్థికంగా సంస్థకే కాకుండా ఉద్యోగులందరికీ నష్టం వాటిల్లుతుందని తెలిపింది. నాలుగు బ్లాక్ లను వేలానికి వెళ్లకుండా చూసేందుకు యాజమాన్యం శక్తివంచన లేకుండా చివరి వరకూ చేసిన ప్రయత్నాలను వివరించింది. కేంద్రానికి సంస్థ తరఫున లేఖ రాయడమే కాకుండా, ఆ బ్లాక్ లలో తాము చేపట్టిన అన్వేషణ పనులను వివరించామని తెలిపింది. బొగ్గు బ్లాక్ ల‌ను సింగరేణికి కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా ప్రధాన మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. బొగ్గు బ్లాక్ల కేటాయింపులో కేంద్రం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకున్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ఇది ఒక్క సింగరేణి కో, తెలంగాణ రాష్ట్రానికో సంబంధించింది కాదని యాజ‌మాన్యం స్ప‌ష్టం చేసింది. ఇక్కడ సమ్మె చేయడం అనేది సమస్య పరిష్కారం సింగరేణి యాజమాన్యం పేర్కొంది. అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు నష్టం జరగడం తప్ప ఉపయోగం ఉండదని వెల్ల‌డించింది. ఉత్పత్తి కి విఘాతం కాకుండా, వేరే పద్ధతుల్లో మన సమస్యను పరిష్కరించుకోవచ్చని యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులకు వివరించింది.

నాలుగు బ్లాక్ ల వేలంతో సింగరేణి మనుగడకే ప్రమాదం : కార్మిక సంఘాలు
కేంద్ర ప్రభుత్వం నాలుగు బ్లాక్ లను వేలం వేస్తే సింగరేణి మనుగడకు ప్రమాదం పొంచి ఉందని అన్ని యూనియన్ల నాయకులు ముక్తకంఠంతో ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని, కార్మిక కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుందని వెల్ల‌డించారు. రైతులు సమ్మె చేయడం ద్వారానే రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుందని, తమ పోరాటం తోనూ బొగ్గు బ్లాక్ లను తిరిగి కాపాడుకుంటామన్నారు. కేంద్రం ఒకవేళ బ్లాక్ లను వేలం వేసినా వాటిని ఎవరు దక్కించుకోవాలని చూసినా సంఘటితంగా అడ్డుకుంటామని స్ప‌ష్టం చేశారు. సింగరేణి ప్రాంతంలో ఇతర సంస్థలు మైనింగ్ కు రాకుండా అడ్డుకుంటామన్నారు. సమష్టి పోరాటంతో సింగరేణి అస్తిత్వాన్ని కాపాడుతామని చెప్పారు. దీనిపై అవసరమైతే అఖిలపక్షంగా ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ని, అలాగే ప్రధానమంత్రిని కలిసి విన్నవిస్తామన్నారు. ఇప్పుడు సమ్మె చేయకపోతే భవిష్యత్ లో బాధపడాల్సి వస్తుందని వెల్ల‌డించారు. కాబట్టి అనివార్యంగానే సమ్మె బాట పడుతున్నామని స్ప‌ష్టం చేశారు. యాజమాన్యం కూడా తమకు సంఘీభావం తెలపాలని కోరారు. ఇంతకు ముందు సంస్థ బీఐఎఫ్ఆర్ లోకి వెళ్లినప్పుడు అన్ని సంఘాలు సంఘటితంగా కృషి చేసి సంస్థను లాభాల బాట పట్టడానికి తోడ్పడిన విషయాన్ని గుర్తుచేశారు.

బొగ్గు బ్లాక్ లను కాపాడేందుకు సమ్మె కాకుండా ఇతర మార్గాల్లో కార్మిక సంఘాలు చేసే పోరాటానికి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని, తెలంగాణ అభివృద్ధికి, సింగరేణి కార్మికుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సమ్మె బాటలో మాత్రం వెళ్లొద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

సమావేశంలో డైరెక్టర్లు చంద్రశేఖర్ (ఆపరేషన్స్), బలరామ్ (ప్రాజెక్ట్స్అండ్ప్లానింగ్, ఫైనాన్స్,పర్సనల్), సత్యనారాయణ రావు (ఈఅండ్ఎం), జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, జీఎం(పర్సనల్,ఐఆర్,పీఎం,ఆర్సీ) ఆనందరావు, జీఎం(సీపీపీ) నాగభూషణ్ రెడ్డి, జీఎం(పిపి) సత్తయ్య, ఏజీఎం(ఐఆర్) హన్మంతరావు, డీవైపీఎం తిరుపతి, టీబీజీకేఎస్ నాయకులు వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, నర్సింహారెడ్డి, హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్అహ్మద్, జక్కుల నారాయణ, సీఐటీయూ నాయకులు రాజిరెడ్డి, మధు, బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, మాధవనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like