సమ్మె విజయవంతం చేద్దాం

మంచిర్యాల : తెలంగాణలో ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మార్చి 28,29వ తేదీలలో చేపట్టిన 48 గంటల సమ్మె విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు మల్రాజు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం గోలేటిలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి కి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేయ‌డాన్ని నిరసిస్తూ రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన‌ట్లు చెప్పారు. కేంద్రంలోని బిజెపి సింగరేణి కార్మికుల పట్ల, తెలంగాణ ప్రభుత్వం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నద‌ని దుయ్య‌బ‌ట్టారు. అందులో భాగంగానే సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలంలో ప్రైవేటు వారికి కేటాయించడానికి సన్నాహాలు చేస్తున్నదని, ఈ విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే డిసెంబర్ 9,10,11 తేదీలలో సింగరేణి కార్మికులు సంపూర్ణ సమ్మె చేశారని గుర్తు చేశారు. దానికి మద్దతుగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన కోల్ బెల్టు శాసనసభ్యులు ఫిబ్రవరి 9న అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి సింగరేణి కార్మికులకు మద్దతు తెలిపార‌ని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణి బొగ్గు వెలికి తీసే విధంగా కేటాయించాలన్నారు. గోలేటి ఓపెన్ కాస్టు, ఎంవికే 1 ఓపెన్ కాస్టు, ఇతర గనులు అటవీ బొగ్గు శాఖ అనుమతులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ ఖైరిగూడ పిట్ కార్యదర్శి కార్నాథం వెంకటేష్, జీఎం కమిటీ స‌భ్యులు మారిన వెంకటేష్ అబ్బు శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్ ఇన్చార్జి వంగామహేందర్ నాయకులు కైత స్వామివామన్, ఓరం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like