పాఠ‌శాల‌నా..? ప‌శువుల కొట్ట‌మా…?

-తాండూరు క‌స్బూర్భా పాఠ‌శాల త‌నిఖీ చేసిన జ‌డ్జి ముఖేష్‌
-ద‌య‌నీయ ప‌రిస్థితుల‌పై తీవ్ర ఆగ్ర‌హం
-ప‌రిస్థితులు మార‌కుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రిక‌

ఇది పిల్ల‌లు తినే తిండేనా..? మీ ఇంట్లో ఇలాగే తింటారా..? మీ పిల్ల‌ల‌కు ఇలాంటి తిండే పెడ‌తారా..? స్కూల్ ప‌రిస‌రాలు ఇంత దారుణంగా ఉంటాయా..? ఓ విద్యార్థినికి జ్వ‌రం వ‌స్తే అలాగే వ‌దిలేస్తారా..? పిల్ల‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలు కూడా క‌ల్పించ‌లేరా..? అంటూ బెల్లంప‌ల్లి జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి ముఖేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం తాండూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూడు గంట‌ల పాటు కస్తూర్భా పాఠ‌శాల క‌లియ‌దిరిగారు. అక్క‌డ ద‌య‌నీయ ప‌రిస్థితులు చూసి సిబ్బంది ప‌నితీరుపై సీరియ‌స్ అయ్యారు.

ఆయ‌న వెళ్లే స‌మ‌యానికి పిల్ల‌ల‌కు భోజ‌నం అందిస్తున్నారు. ఆ వంట‌ల‌ను చూసి ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఉడికీ ఉడ‌క‌ని ప‌ప్పు, స‌రిగ్గా ఉడ‌క‌ని అన్నం చూసి ఇదేంట‌ని అడిగారు. ఇంట్లో ఇలాగే తింటారా..? మీ పిల్ల‌ల‌కు ఇలాంటి తిండే పెడ‌తారా..? అంటూ జ‌డ్జి ఎస్‌వోను ప్ర‌శ్నించారు. నాణ్య‌త లేని ఇలాంటి భోజనం పిల్లలకు ఎలా అందిస్తార‌ని మంద‌లించారు. అనంత‌రం క్లాస్‌రూంల‌ను చూసిన ఆయ‌న క‌నీసం ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు కూడా లేవ‌న్న విష‌యాన్ని గ‌మ‌నించారు. ఎండాకాలం ఎలా ఉన్నార‌ని పిల్ల‌ల‌ను ప్ర‌శ్నించ‌డంతో ఫ్యాన్లు లేకుండానే ఉన్నామ‌ని చెప్ప‌డంతో జ‌డ్జి ముఖేష్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

కేవ‌లం చాప‌ల మీద పిల్ల‌లు ప‌డుకోవ‌డం చూసి ఇదేంట‌ని ప్ర‌శ్నించారు. తాము పడుకోవటానికి కూడా సరైన వసతులు లేవని విద్యార్థినులు ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. ఇక టాయిలెట్స్ కూడా శుభ్రంగా లేని విషయాన్ని ఆయ‌న పరిశీలించారు. విద్యార్థినుల ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉందంటూ మ‌రోమారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పిల్లల పట్ల నిర్లక్ష్య ధోరణి మానుకోవాలని ఎస్‌వోను మందలించారు. పిల్ల‌ల‌కు మంచి పౌష్టికాహారం అందించాల‌ని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. మళ్లీ తాను పర్యవేక్షణకు వస్తానని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జ‌డ్జి ముఖేష్. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిప్ప మనోహర్, ప్రధాన కార్యదర్శి సింగతి రాజేష్, జాయింట్ సెక్రటరీ దాసారపు రాజు, న్యాయవాది సబ్బని సాయి కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like