సికింద్రాబాద్ అల్ల‌ర్ల‌లో పాల్గొన్న యువ‌కుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

సికింద్రాబాద్ అల్ల‌ర్ల‌లో పాల్గొన్న యువ‌కుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో కొందరు యువకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులకు భయపడి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆందోళనలో పాల్గొన్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాదం జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.

స్టేషన్ ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అజయ్ (20) ఆర్మీలో చేరేందుకు సిద్దమవుతున్నాడు. ఈ నేప‌థ్యంలో డిఫెన్స్ అకాడ‌మీ నిర్వాహ‌కులు రెచ్చ‌గొట్ట‌డంతో యువ‌కులు సికింద్రాబాద్ అల్ల‌ర‌ల్లో పాల్గొన్నారు. వారితో పాటు అజ‌య్ కూడా వెళ్లాడు. ఈ సమయంలో అతడు అగ్నిపథ్ వ్యతిరేకిస్తూ మీడియాతో కూడా మాట్లాడాడు. టీవీలో కనిపించిన తనపై పోలీసులు కేసు నమోదు చేస్తారేమోనని అజయ్ భయపడిపోయాడు.

పోలీస్ కేసు నమోదు, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోన‌నే భ‌యంతో అజయ్ ఆందోళనకు గురయ్యాడు. జైలుకెళతాన‌నే భయం.. త‌న‌కు ఏ ఉద్యోగం కూడా రాద‌ని ఒంటరిగా వున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అజయ్ ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ డాక్టర్లు వెంటనే వైద్యం అందించడంతో అజయ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి ప్రాణాలతో బయటపడ్డాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like