సింగ‌రేణి సేవా స‌మితి స్టాల్‌కు ద్వితీయ బ‌హుమ‌తి

-జీఎం(కో ఆర్డినేష‌న్‌), సేవా స‌మితి ఉపాధ్య‌క్షుడు ఎం.సురేశ్ అభినంద‌న‌లు
-ఎగ్జిబిష‌న్ లో రూ.5 ల‌క్ష‌ల విలువైన సేవా ఉత్ప‌త్తుల విక్ర‌యం

హైద‌రాబాద్ నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్లో సింగ‌రేణి సేవా స‌మితి ఏర్పాటు చేసిన స్టాల్ కు ద్వితీయ బ‌హుమ‌తి ల‌భించింది. నుమాయిష్ లో మొత్తం 2500 స్టాళ్ల‌ను ఏర్పాటు చేయ‌గా.. ఇందులో కార్పోరేట్ విభాగంలో సింగ‌రేణి సేవా స‌మితి స్టాల్‌కు ద్వితీయ బ‌హుమ‌తి ల‌భించ‌డం విశేషం. బుధ‌వారం ఎగ్జిబిష‌న్ ముగింపు నేప‌థ్యంలో అత్యుత్త‌మ స్టాళ్లకు ఎగ్జిబిష‌న్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన క‌మిటీ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. స్టాల్ డెక‌రేష‌న్‌, వ‌స్తు విక్ర‌య తీరు, ప్ర‌చారం త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని సింగ‌రేణి సేవా స‌మితి స్టాల్ అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు ఎగ్జిబిష‌న్ సొసైటీ నిర్వాహ‌కులు తెలిపారు.

ఎగ్జిబిష‌న్ సొసైటీ అధికారులు ప్ర‌దానం చేసిన ఈ బ‌హుమ‌తిని అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ ఎన్‌.భాస్క‌ర్‌, సీనియ‌ర్ పీవో ఎస్‌.శ్రీ‌కాంత్ లు జీఎం(కో ఆర్డినేష‌న్‌) సింగ‌రేణి సేవా స‌మితి ఉపాధ్య‌క్షుడు ఎం.సురేశ్‌కు బుధ‌వారం సింగ‌రేణి భ‌వ‌న్లో అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జీఎం(కో ఆర్డినేష‌న్‌) మాట్లాడుతూ.. సేవా స‌మితి స్టాల్‌కు బ‌హుమ‌తి ల‌భించ‌డం ప‌ట్ల అభినంద‌న‌లు తెలిపారు. మ‌హిళా సాధికార‌త‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో సింగ‌రేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో ఉచిత స్వ‌యం ఉపాధి శిక్ష‌ణ‌ల‌ను అందిస్తోంద‌ని తెలిపారు. అంతేకాకుండా ఔత్సాహిక మ‌హిళ‌లు సొంతంగా వ‌స్తు త‌యారీ కేంద్రాల‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి స‌హ‌కారం అందిస్తోంద‌ని పేర్కొన్నారు.

దాదాపు 18 ఏళ్లుగా నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ లో సింగ‌రేణి సేవా స‌మితి మ‌హిళ‌లు త‌మ ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించుకునేందుకు వీలు క‌ల్పిస్తోంద‌న్నారు. 45 రోజుల పాటు జ‌రిగిన నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్‌లో సింగ‌రేణిలోని 10 ఏరియాల‌కు చెందిన మ‌హిళ‌లు పాల్గొన్నార‌ని, దాదాపు రూ. 5 ల‌క్ష‌ల విలువైన క్లాత్ బ్యాగులు, మ‌గ్గంతో త‌యారు చేసిన వ‌స్త్రాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను విక్ర‌యించార‌ని తెలిపారు. నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ లో వ‌స్తు విక్ర‌యానికి స్టాల్, వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించిన సింగ‌రేణి యాజ‌మాన్యానికి సేవా స‌మితి మ‌హిళ‌లు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. డిప్యూటీ సూప‌రింటెండెంట్ కిశోర్‌, సేవాస‌మితి కో ఆర్డినేట‌ర్ శివ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like