సికింద్రాబాద్ అల్ల‌ర్ల కేసులో ఏ 2 అరెస్టు

-ఆదిలాబాద్‌కు చెందిన పృథీరాజ్ రిమాండ్‌
-ఇప్ప‌టికే మొత్తం 46 మంది అరెస్టు

సికింద్రాబాద్ అల్ల‌ర్ల ఘ‌ట‌న‌లో అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఈ కేసులో ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండ‌లం బేత్లగూడ గ్రామ పంచాయ‌తీ సోనాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ పృథ్వీరాజ్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రైల్వేస్టేషన్‌లో మొదటగా విధ్వంసం చేసిన నిందితుల వీడియోలు సేక‌రించిన పోలీసులు ఈ పృథ్వీరాజ్‌ను ఏ2గా చేర్చారు. పృథ్వీరాజ్ అల్లర్లకు సూత్రధారిగా నిర్దారించారు. ఆ యువ‌కుడు ప్యాసింజర్ బోగీలోకి వెళ్లి సీట్లకు నిప్పుపెట్టాడు. వాటికి నిప్పుపెడుతూ వీడియోలు సైతం తీసుకున్నాడు. ప్లాట్‌ఫామ్‌పై ఆస్తులను సైతం ధ్వంసం చేసి వాట‌న్నింటిని వీడియోలు తీయించాడు. విధ్వంసానికి సంబంధించిన వీడియోలను గ్రూప్‌ల్లో పోస్ట్ చేశాడు. పృథ్వీరాజ్ వీడియోలు చూసి మిగ‌తా యువ‌కులు సైతం రెచ్చిపోయారు. శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన వారిని సైతం కొందరు యువకులు విధ్వంసం వైపు ప్రోత్సహించారు. దీంతో రైల్వే ఆస్తులు, బోగీలను ఆ యువ‌కులు తగులబెట్టినట్లు గుర్తించారు. పృథ్వీరాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

అల్లర్ల ఘటనలో మొత్తం 56 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇప్పటికే 46 మందిని అరెస్ట్​ చేశారు. ఇప్పుడు.. ఈ​ అల్లర్లతో ప్రమేయం ఉన్న మరో 10 మంది నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏ-2 పృథ్వీరాజ్​తో పాటు.. మరో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వాళ్లందరిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. వారిని నిందితులుగా చేర్చారు. ఆ తర్వాత వాళ్లను సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తర్వాత పోలీసులు చంచల్​గూడ జైలుకి తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like