సెమీఫైన‌ల్ లో గెలుపు కోసం..

-సింగరేణిలో యూనియ‌న్ల మ‌ల్ల‌గుల్లాలు
-బ‌లాబ‌లాలు, వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న నేత‌లు
-కార్మికుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఇప్ప‌టి నుంచే య‌త్నాలు
-అనుబంధ పార్టీలు కూడా రంగంలోకి దిగేందుకు స‌న్నాహాలు

మంచిర్యాల : సింగ‌రేణిలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అన్ని యూనియ‌న్లు గెలుపు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నిక‌లు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల‌కు సెమీఫైన‌ల్‌గా నిల‌వ‌నున్నాయి. దీంతో ఇందులో ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా గెలిచి ప‌ట్టు నిలుపుకుంటే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మార్గం సుగ‌మ‌మం అవుతుంద‌ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోరు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.

సింగరేణి తెలంగాణలోని ఐదు జిల్లాలో విస్తరించి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలో సింగరేణి గనులు ఉన్నాయి. వీటిలో 42 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ జిల్లాలో సింగరేణి కార్మికులు కీల‌క భూమిక పోషిస్తారు. దాదాపు ప‌న్నెండు నియోజ‌వ‌క‌ర్గాల్లో వీరి పాత్ర ఉంటుంది. ఈసారి జరిగే సింగరేణి ఎన్నికల ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలపై పడే అవకాశం ఉంది. స్థానిక రాజకీయ పరిస్థితులకు కీలకంగా మారిన నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు వివిధ‌ రాజకీయ పక్షాలకు కీలకంగా మారనుంది. దీంతో రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలను గెలిపించుకునేందుకు పార్టీలు రంగంలోకి దిగ‌నున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో వామపక్ష పార్టీలు మూడు సార్లు గుర్తింపు పొందగా, ఒకసారి కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. తర్వాత రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయభేరి మోగించింది. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో గెల‌వాల‌ని అన్ని యూనియ‌న్లు ముందుకు సాగుతున్నాయి. ముఖ్య నేత‌ల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో సీనియ‌ర్ కార్మికులు, యువ‌త‌కు ఇప్ప‌టి నుంచే త‌మ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. కార్మికుల‌కు తాము ఇచ్చే హామీలు, ఎదుటి యూనియ‌న్ల‌పై మాట‌ల‌తో ఏ విధంగా దాడి చేయాలి..? ఇలా అన్ని ర‌కాలుగా సిద్దం అవుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం కార్మిక సంఘ నేత‌ల‌ను కాకుండా, ఆ ప్రాంతంలో ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులను రంగంలోకి దింపింది. ఈసారి కూడా అదే వ్యూహాన్ని అనుస‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక మిగ‌తా పార్టీలు సైతం త‌మ నేత‌ల‌ను బ‌రిలోకి దించ‌నున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్న నేప‌థ్యంలో సింగ‌రేణిలో ఎన్నిక‌ల్లో పోరు హోరాహోరీగా సాగ‌నుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like