సింగరేణి బొగ్గుకు పెరుగుతున్న ఆదరణ

షోలాపూర్‌ ఎన్‌.టి.పి.సి. ప్లాంటుకు బొగ్గు సరఫరాపై ఇంధన సరఫరా ఒప్పందం - ఏడాదికి 25 లక్షల 40 వేల టన్నుల సరఫరా - కోలిండియా నుండి సింగరేణికి మారిన ఎన్‌.టి.పి.సి

సింగరేణి బొగ్గుకు దేశ వ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. కోలిండియా నుండి బొగ్గు స్వీకరిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు కూడా సింగరేణి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎన్‌.టి.పి.సి. సంస్థ మహారాష్ట్రలోని షోలాపూర్‌ వద్ద నిర్మించిన షోలాపూర్‌ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంటులో యూనిట్‌-1 కోసం సింగరేణి నుండి బొగ్గు స్వీకరించడానికి ముందుకు వచ్చింది. సోమవారం హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో ఈ మేరకు సింగరేణి, ఎన్‌.టి.పి.సి. ఉన్నతాధికారుల మధ్య ఇందన సరఫరా ఒప్పందం (ఫ్యూయల్‌ సప్లై అగ్రిమెంట్‌) జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సింగరేణి సంస్థ షోలాపూర్‌ ప్లాంటులోని ఒకటవ యూనిట్‌ కు ఏడాదికి 25 లక్షల 40 వేల టన్నుల బొగ్గు చొప్పున మరో 25 ఏళ్లపాటు బొగ్గు సరఫరా చేయనుంది.

వాస్తవానికి ఈ యూనిట్‌కు కోలిండియా నుండి బొగ్గు స్వీకరించాల్సి ఉంది. కానీ ఎన్‌.టి.పి.సి. సంస్థ తాము సింగరేణి నుండి బొగ్గు స్వీకరిస్తామని, అందుకు అనుమతించాలని బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. నాణ్యత, నిరంతరాయ సరఫరా, దూరం తదితర అంశాలలో సింగరేణి నుండి బొగ్గు తీసుకోవడమే తమకు అనుకూలంగా, లాభదాయకంగా ఉంటుందని స్ప‌ష్టం చేసింది. దీంతో బొగ్గు మంంత్రిత్వ శాఖ దీనికి అంగీకరించింది. బొగ్గు కేటాయింపుల కమిటీ సూచనపై సింగరేణి, ఎన్‌.టి.పి.సి. మధ్య సోమవారం ఇంధన సరఫరా ఒప్పందం జరిగింది.

ఎన్‌.టి.పి.సి. లకు 135.30 లక్షల టన్నుల సరఫరా
సింగరేణి సంస్థ ఇప్పటికే 8 రాష్ట్రాలలో గల ఎన్‌.టి.పి.సి. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటులకు బొగ్గు సరఫరా చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోని ప్లాంటులతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిస్సా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలోని ప్లాంటులకు ఏడాదికి 135.30 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి అందిస్తోంది. దశాబ్దాల కాలంగా ఇరు సంస్థల మధ్య ఒప్పందాల మేరకు సజావుగా బొగ్గు సరఫరా సాగుతుండడంతో కొత్తగా నిర్మిస్తున్న ప్లాంటులకు కూడా ఎన్‌.టి.పి.సి. సింగరేణి బొగ్గునే కోరుకుంటుంది. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (కోల్‌ మూమెంట్‌) జె.ఆల్విన్‌, జి.ఎం (మార్కెటింగ్‌) కె.రవిశంకర్‌, డి.జి.ఎం. (మార్కెటింగ్‌) మారెపల్లి వెంకటేశ్వర్లు, ఎన్‌.టి.పి.సి. నుండి రీజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ మనీష్‌ జవహరి, చీఫ్‌ జి.ఎం. ఎన్‌.ఎన్‌రావు, ఎ.జి.ఎం. పి.కె.రావత్‌ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like