సింగ‌రేణి గ‌డ్డ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలే

-ఇక్క‌డి వారి క‌ల శాశ్వ‌తంగా నెర‌వేరుతోంది
-జీవో 76 తీసుకొచ్చిన ఘనుడు బాల్క సుమన్
-చెన్నూరు అభివృద్ధికి స‌హ‌క‌రిస్తా మంత్రి మ‌ల్లారెడ్డి
-తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష
-సింగరేణి ఎన్నికల మేనిఫెస్టులో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: విప్ బాల్క సుమ‌న్

మంచిర్యాల :ఎన్నో ఏండ్లుగా సింగ‌రేణి గ‌డ్డ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌చ్చిన త‌ర్వాత సింగ‌రేణిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌ని రాష్ట్ర కార్మిక‌,ఉపాధి శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి అన్నారు. మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఇక్క‌డ ఇళ్ల పట్టాల గురించి క‌నీసం ప‌ట్టించుకోలేద‌న్నారు. అస‌లు వారికి ఆ ఆలోచ‌నే లేద‌న్నారు. సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. సింగరేణి ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలు అందడం నిజంగా అదృష్టమ‌న్నారు. ఈ రోజుతో వారి శాశ్వత కల నెరవేరబోతోందని ఆనందం వ్య‌క్తం చేశారు.

జీవో 76 తీసుకొచ్చిన ఘనుడు బాల్క సుమన్ అని ఈ సంద‌ర్భంగా కొనియాడారు. సుమన్ చెన్నూర్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని స్ప‌ష్టం చేశారు. చెన్నూరులో లక్షకుపైగా ఎకరాలకు సాగునీరు అందించేందుకు ముందుకు సాగుతున్నాడ‌ని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నా అదృష్టంగా భావిస్తున్నానని వెల్ల‌డించారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్ప‌ష్టం చేశారు. స్వతంత్ర భారతావనిలో ఎవరూ చేయలేని అభివృద్ధి సంక్షేమ పనులు కేసీఆర్ ప్రభుత్వం చేస్తోంద‌న్నారు.

ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం క్యాతనపల్లి మున్సిపాలిటీకి శాపంగా మారిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 60 ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టకరమ‌న్నారు. 2014 సింగరేణి ఎన్నికల మేనిఫెస్టులో ఇచ్చిన మాట నిలబెట్టు కున్నామని స్ప‌ష్టం చేశారు. జీవో 76 తీసుకొచ్చి ఇండ్ల పట్టాలకి అంకురార్పణ చేశామ‌ని వెల్ల‌డించారు. ఇండ్ల పట్టాలు పంపిణీ ప్రక్రియ పూర్తయితే సుమారు 4000 మందికి పైగా మహిళలు లక్షాధికారులు కాబోతున్నారని తెలిపారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పట్టాలు అందేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు.

RK 4గడ్డ, శాంతినగర్, వల్లభాయి నగర్ నాగార్జున కాలనీ, ప్రగతి కాలనీ, రాజీవ్ నగర్, ఠాగూర్ నగర్, రామ్ నగర్, భగత్ సింగ్ నగర్, గంగా కాలనీ, సూపర్ బజార్ ఏరియా,దుర్గా రావు మార్కెట్, గీతా మందిర్ ఏరియా లో మిస్సయిన ఇండ్లను తిరిగి చేర్పించామ‌ని తెలిపారు. మూతబడిన గనుల వల్ల రామకృష్ణాపూర్ పట్టణం ప్రాముఖ్యత త‌గ్గింద‌ని, ఇళ్ల పట్టాలతో పూర్వవైభవం సంతరించుకోనుందని ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేశారు. లక్షల రూపాయలు వెచ్చించి, అప్పులు చేసి మరీ వేరే ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఉండదని తెలిపారు. ఇండ్ల పట్టాలతో అప్పుల బాధ లేకుండా తక్కువ ఖర్చుతో సొంత ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టవచ్చన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తవుతున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ కూడా మరింత మెరుగవుతుంద‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి,గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ప్ర‌వీణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like