సింగ‌రేణికి వందేళ్లకు పైగా ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌

-2029-30 నాటికి 100 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తి
-మ‌రో నాలుగేళ్ల లో 3 వేల మెగావాట్ల విద్యుత్‌
-రూ.2 వేల కోట్లు దాట‌నున్న లాభాలు
-క‌ష్ట‌ప‌డితేనే మ‌న మ‌నుగ‌డ సాధ్యం
-సింగ‌రేణి ఆవిర్భావ దినోత్స‌వంలో సింగ‌రేణి సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్

Singareni: మ‌రో వందేళ్ల సింగ‌రేణి సంస్థ కు తిరుగు ఉండ‌ద‌ని ఆ సంస్థ‌ సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ పేర్కొన్నారు. హైద‌రాబాద్ సింగ‌రేణి భ‌వ‌న్ లో శుక్ర‌వారం జ‌రిగిన సింగ‌రేణి ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. సింగ‌రేణి కంపెనీ నేటి పోటీ మార్కెట్ ను త‌న బ‌హుముఖ వ్యాపార విస్త‌ర‌ణ చ‌ర్య‌ల‌తో ధీటుగా ఎదుర్కోనున్న‌ద‌ని అన్నారు. మ‌రో ఐదేళ్లలో 10కొత్త గ‌నులు, 3వేల మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తితో ఆర్థిక పునాదులు సుస్థిరంగా ఏర్ప‌ర‌చుకొని ముందుకు పోతుంద‌న్నారు.

స‌మ‌ర్థవంతంగా ప‌నిచేయ‌ని కార‌ణంగా దేశంలో చాలా ప్ర‌భుత్వ కంపెనీలు మూత‌ప‌డ్డాయ‌న్నారు. కానీ సింగ‌రేణి ఎప్ప‌టిక‌ప్పుడు ల‌క్ష్యాల‌ను సాధిస్తూ ముందుకు పోవ‌డం వ‌ల్ల 133 సంవ‌త్స‌రాలుగా మ‌నుగ‌డ సాగిస్తోంద‌న్నారు. నేటి పోటీ మార్కెట్ లో ప్రైవేట్‌, ప్ర‌భుత్వ సంస్థ ల‌తో కూడా పోటీ ప‌డి నిల‌దొక్కుకునే సామ‌ర్థ్యం ఉంద‌న్నారు. తెలంగాణ రాక పూర్వం నిరాద‌ర‌ణ‌కు గురైన సింగ‌రేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో అన్ని రంగాల్లో వృద్ధి చెందుతూ దేశంలో ఒక అగ్ర‌గామి కంపెనీగా నిలిచింద‌న్నారు.

బొగ్గు ఉత్ప‌త్తి 50 మిలియ‌న్ ట‌న్నుల‌ నుంచి 65 మిలియ‌న్ ట‌న్నుల‌కు, ట‌ర్నోవ‌ర్ 12వేల కోట్ల నుంచి 26వేల కోట్ల‌కు పెంచుకున్నామ‌ని తెలిపారు. ఇదే ఒర‌వ‌డితో ఈ ఏడాది 700 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గును ఉత్ప‌త్తి చేస్తున్నామ‌ని, త‌ద్వారా 32వేల కోట్ల ట‌ర్నోవ‌ర్, 2 వేల కోట్ల లాభాల దిశ‌గా పురోగ‌మిస్తున్నామ‌ని తెలిపారు. సింగ‌రేణి నెల‌కొల్పిన థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం 90శాతం పైగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్ట‌ర్ సాధించింద‌ని గుర్తు చేశారు. దేశంలో ఉన్న ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల స్థాయిని అధిగ‌మించి జాతీయ స్థాయిలో నెంబ‌ర్ 1గా నిల‌వ‌డం సింగ‌రేణి ప‌నితీరుకు, అంకిత భావానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. సింగ‌రేణి ప‌నితీరు మెచ్చి ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర‌రావు మ‌రో 800మెగావాట్ల ప్లాంట్ అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాల‌న్నార‌ని వెల్ల‌డించారు. మార్చి నుంచి ప‌నులు మొద‌ల‌వుతాయ‌న్నారు.

ఈ ప్రాజెక్టు పూర్త‌యితే తెలంగాణ రాష్ట్రానికి సింగ‌రేణి సంస్థ అందించే థ‌ర్మ‌ల్ విద్యుత్ 2వేల మెగావాట్ల‌కు చేరుతుంద‌న్నారు. అలాగే ప్ర‌స్తుతం నిర్మించిన‌ 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల‌కు అద‌నంగా మ‌రో 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌ని, దీంతో సింగ‌రేణి సోలార్ ప‌వ‌ర్‌ వెయ్యి మెగావాట్ల‌కు చేరుతుంద‌న్నారు. ఈ విధ‌మైన బ‌హుముఖ‌ వ్యాపార విస్త‌ర‌ణ చ‌ర్య‌ల‌తో సింగ‌రేణి సంస్థకు బ‌ల‌మైన ఆర్థిక పునాదులు ఏర్ప‌డుతున్నాయని శ్రీ‌ధ‌ర్ స్ప‌ష్టం చేశారు. కార్మికులు, ఉద్యోగులు కూడా పూర్తి ప‌ని గంట‌లు స‌ద్వినియోగం చేస్తూ యంత్రాల‌ను పూర్తి శాతం వినియోగిస్తూ ఉత్పాద‌క‌త పెంచాల‌ని కోరారు. అప్పుడే పోటీ మార్కెట్ లో నిల‌బ‌డ‌గ‌ల‌మ‌ని, సింగ‌రేణి సంస్థ‌ను మ‌రో వందేళ్లు ముందుకు తీసుకెళ్ల‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు.

ముందుగా ఆయ‌న సింగ‌రేణి త‌ల్లి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి జాతిపిత మ‌హాత్మాగాంధీకి ఘ‌న నివాళుల‌ర్పించారు. అనంత‌రం సింగ‌రేణి ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా సింగ‌రేణి భ‌వ‌న్ నుంచి ఎంపిక చేసిన ఉత్త‌మ అధికారులు డీజీఎం(ఐటీ) గ‌డ్డం హ‌రి ప్ర‌సాద్‌, ఎస్వోఎం (మార్కెటింగ్‌) సురేంద‌ర్ రాజు, ఉద్యోగుల నుంచి డిప్యూటీ సూప‌రింటెండెంట్ ఎండీ అహ్మ‌ద్‌, ఎంవీ డ్రైవ‌ర్ సుధాక‌ర్ ల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. కార్య‌క్ర‌మంలో అడ్వైజ‌ర్‌(మైనింగ్‌) డి.ఎన్‌.ప్ర‌సాద్‌, అడ్వైజ‌ర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ(కోల్ మూమెంట్‌) జె.అల్విన్‌, జీఎం(కో ఆర్డినేష‌న్) సురేశ్‌, జీఎం(మార్కెటింగ్‌) కె.సూర్య‌నారాయ‌ణ‌, సీఎంవోఏఐ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్.వి.రాజ‌శేఖ‌ర‌రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ భాస్క‌ర్ పాల్గొన్నారు.

అల‌రించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు…
సింగ‌రేణి ఉద్యోగులు, అధికారులు క‌లిసి మ‌ధ్యాహ్నం నిర్వ‌హించిన సంగీత విభావ‌రి, కామెడీషో, డ్యాన్స్‌, ఆట‌లు అంద‌రినీ అల‌రించాయి. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు ఉత్త‌మ సిబ్బందికి జీఎం(కో ఆర్డినేష‌న్‌) ఎం.సురేశ్ బ‌హుమ‌తులు అంద‌జేశారు. సింగ‌రేణి ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించిన వివిధ పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. ఆయ‌న సింగ‌రేణి ఉన్న‌తి కోసం కార్మికులు చేసిన త్యాగాల‌ను గుర్తుచేశారు. కార్య‌క్ర‌మంలో జీఎం (మార్కెటింగ్‌) కె.సూర్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. స‌మ‌ష్టి కృషి తోనే అభివృద్ధి సాధ్య‌మ‌న్నారు. సీఎంవోఏఐ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌.వి.రాజ‌శేఖ‌ర‌రావు మాట్లాడుతూ.. సింగ‌రేణి అభివృద్ధి ప్ర‌స్థానాన్ని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ ఎన్‌.భాస్క‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like