తొమ్మిదేళ్లలో సింగరేణి అద్భుత ప్రగతి

-రాష్ట్రాలలో తెలంగాణ, పరిశ్రమలలో సింగరేణి దేశానికి ఆదర్శప్రాయం
-తెలంగాణ రాకపూర్వంతో పోలిస్తే లాభాల్లో 421% వృద్ధి
-అమ్మకాలలో 176% వృద్ధి, ఉత్పత్తిలో 33% వృద్ధి, రవాణాలో 39% వృద్ధి
-ముఖ్యమంత్రి ఆదేశంతో 19 వేలకు పైగా కొత్త నియామకాలు
-తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్.శ్రీధర్

Singareni: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత తొమ్మిదేళ్లలో సింగరేణి అన్ని రంగాలలో అత్యద్భుతమైన ప్రగతిని సాధించిందని, సంక్షేమంలో కూడా దేశంలో గల అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సింగరేణికి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి దిశా నిర్దేశంలో గతంలో ఎన్నడూ సాధించని వృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ రాకపూర్వం సింగరేణి టర్నోవర్ రూ. 11,928 కోట్లు ఉండగా తొమ్మిది సంవత్సరాల్లో 176% వృద్ధితో గత ఏడాది రూ.32, 978 కోట్లకు పెరిగిందన్నారు. ఇంతటి వృద్ధి దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సాధించలేదన్నారు. మహారత్న కంపెనీతో పోల్చి చూస్తే సింగరేణి ద్వితీయ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ రాకపూర్వం 2014లో 419 కోట్ల రూపాయల లాభాలు గడించిన సింగరేణి గత ఏడాది 421 శాతం వృద్ధితో 2,184 కోట్ల రూపాయల లాభాలను గడిచిందని శ్రీ‌ధ‌ర్ వెల్ల‌డించారు. ఇది కూడా మరే ఇతర ప్రభుత్వ సంస్థ సాధించని ఘనమైన వృద్ధి అని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 33% బొగ్గు రవాణాలో 39% వృద్ధిని సాధించామని, గడచిన తొమ్మిదేళ్లలో 14 కొత్త గనులను ప్రారంభించుకున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన సంస్థ కూడా సింగరేణి అని వివరిస్తూ, ఇప్పటివరకు 19,463 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించిన‌ట్లు సీఅండ్ఎండీ వెల్ల‌డించారు. వీటిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కారుణ్య ఉద్యోగ నియామ‌కాల‌ కింద 15,250 మంది వారసులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 4,207 మందికి ఉద్యోగాలు ఇచ్చామని శ్రీ‌ధ‌ర్ తెలిపారు. కార్మికుల సొంత ఇంటి నిర్మాణం కోసం పది లక్షల గృహ రుణంపై వడ్డీని సింగరేణి సంస్థ చెల్లిస్తోందన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ ను లక్ష నుండి పది లక్షలకు పెంచామని, ఉన్నత చదువులు చదివే కార్మికుల పిల్లలకు సింగరేణి సంస్థ ఫీజులు చెల్లిస్తుందని వివరించారు.

దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని సంక్షేమ పథకాలు సింగరేణి సంస్థలో అమలు అవుతున్నాయని, ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన విద్యుత్తు అందించడంలో సింగరేణి సంస్థ తనవంతుగా రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును అందించటమే కాక సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్ కూడా అందిస్తోందన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో సింగరేణి సంస్థ ప్రస్తుతం 67 మిలియన్ టన్నుల నుండి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకుపోతోందని, దీనికోసం 8 కొత్త గనుల ప్రారంభిస్తుందన్నారు. అలాగే ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 వేల మెగావాట్లకు పెంచేలా థర్మల్, సోలార్ విద్యుత్ కేంద్రాలను ప్రారంభించబోతున్నామన్నారు. తద్వారా ప్రస్తుత 32 వేల కోట్ల టర్నోవర్ 50 వేల కోట్లకు చేరుకుంటుందని, ఈ దిశగా కార్మికులు అధికారులు సమిష్టిగా అంకితభావంతో కృషి చేయాలని శ్రీ‌ధ‌ర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఈ అండ్ఎం సత్యనారాయణ రావు, అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్, అడ్వైజర్ లా లక్ష్మణరావు, అధికారుల సంఘం జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్ వివిధ విభాగాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like