సింగ‌రేణి కార్మికుల‌కు రూ.40 లక్షల ప్రమాద బీమా

-సింగరేణి - ఎస్‌.బి.ఐ. మధ్య చారిత్రక ఒప్పందం
-డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, పర్సనల్‌) ఎన్‌.బలరామ్‌ ప్రత్యేక చొరవతో ఇన్సూరెన్స్‌ రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంపు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కార్పొరేట్‌ శాలరీ అకౌంట్‌ ఉన్న ప్రతీ సింగరేణి ఉద్యోగికి రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపచేసేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంగీకారం తెలిపింది. ఈ మేర‌కు శుక్ర‌వారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ మధ్య ఒప్పందం కుదిరింది. దీనివల్ల ఎస్‌.బి.ఐ. లో ఖాతాలు ఉన్న సుమారు 35 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో పాటు ఈ ఒప్పందంలో సింగరేణి ఉద్యోగులకు లబ్ధి చేకూరే పలు రాయితీలను కూడా కల్పించారు. ఈ ఒప్పందం వచ్చే నెల 4వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. సింగరేణి డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, పర్సనల్‌) బలరామ్‌, ఎస్‌.బీ.ఐ. చీఫ్‌ జనరల్‌ మేనేజర్ అమిత్‌ జింగ్రాన్‌ సమక్షంలో హైదరాబాద్‌ (కోఠి)లోని ఎస్‌.బి.ఐ. ప్రధాన కార్యాలయంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇందులో ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌.బి.ఐ. చీఫ్‌ జనరల్‌ మేనేజర్ అమిత్‌ జింగ్రాన్‌ మాట్లాడుతూ డైరెక్టర్ ఎన్‌.బలరామ్‌ ఈ చారిత్రక ఒప్పందంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఏడాది కాలంగా ఆయన తమతో పాటు ముంబయిలోని తమ బ్యాంక్‌ ఉన్నతాధికారులతో చర్చించార‌ని వెల్ల‌డించారు. 40 లక్షల రూపాయల ప్రమాద భీమాతో పాటు ఉద్యోగులకు లబ్ధి చేకూరే పలు రాయితీలపై ఒప్పించారని అభినందించారు. సింగరేణి సంస్థ, ఎస్‌.బి.ఐ. లకు మధ్య వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు ఎన్నోఏళ్లుగా సాగుతున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. యాజమాన్యం విజ్ఞప్తిపై కార్మికుల ఖాతాలన్నింటినీ కార్పోరేట్‌ శాలరీ అకౌంట్లుగా మార్చి ప్రమాద బీమా మొత్తాన్ని 20 లక్షల నుంచి రూ.40 లక్షల కు పెంచినట్లు తెలిపారు.

డైరెక్టర్ ఎన్‌.బలరామ్‌ మాట్లాడుతూ సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశం మేరకు కార్మికులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ ఒప్పందం చేసుకున్నామన్నారు. ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండానే బ్యాంక్‌ ఖాతా ఉన్న సింగరేణి ఉద్యోగులందరికీ రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని క‌లుగుతుంద‌న్నారు. ఇదే మొత్తాన్ని శాశ్వత అంగ వైకల్యం జరిగిన సందర్భంలో కూడా ఇన్సూరెన్స్‌ గా చెల్లిస్తారని చెప్పారు. పాక్షిక అంగ వైకల్యానికి రూ.20 లక్షల వరకు చెల్లిస్తారని తెలిపారు. ఇవే కాకుండా కేవలం సింగరేణి ఉద్యోగుల కోసమే మరికొన్ని రాయితీలను ఇవ్వడానికి ఎస్‌.బి.ఐ. అంగీకరించిందని, ఇదొక చారిత్రక ఒప్పందమని అన్నారు.

సింగ‌రేణికి, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మ‌ధ్య జ‌రిగిన ఒప్పందంలో ముఖ్యాంశాలు..

-ఉద్యోగి వేతనం , హోదాకు సంబంధం లేకుండా రూ.40 లక్షల ప్రమాద బీమా
-ప్రమాదంలో శాశ్వత అంగ వైకల్యానికి కూడా రూ.40 లక్షల బీమా వర్తింపు
-పాక్షిక అంగవైకల్యానికి రూ.20 లక్షల బీమా
-డిమాండ్‌ డ్రాఫ్ట్‌లకు , పాస్‌ బుక్కులకు, ఏటీఎం కార్డు లావాదేవీలకు ప్రస్తుతం ఉన్న ఛార్జిలు ఎత్తివేత
-ఏటీంఎ కార్డు ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.40 వేల గరిష్ట విత్‌ డ్రాయల్‌ పరిమితి రూ.లక్షకు పెంపు
-ఎస్పీఐ,ఇతర ఏటీఎంలలో ఉచిత విత్‌ డ్రాయల్‌ సౌకర్యం
-ఉచిత ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌
-విశ్రాంత కార్మికుల అకౌంట్ల కు కూడా వర్తింపచేసేందుకు ఆలోచ‌న చేస్తున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్‌.బలరామ్‌ విశ్రాంత కార్మికులకు కూడా ఈ ప్రమాద బీమాను వర్తింపజేయాలని కోరగా.. దీనిపై మరో ప్యాకేజీతో ఒప్పందానికి ముసాయిదా ప్రతిపాదన సమర్పించాలని సంబంధిత అధికారులను చీఫ్‌ జనరల్‌ మేనేజర్ అమిత్‌ జింగ్రాన్‌ ఆదేశించారు. త్వరలోనే ఇది కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. కార్యక్రమంలో సింగరేణి జీఎం (కో ఆర్డినేషన్‌) కె.సూర్యనారాయణ, జీఎం (పర్సనల్‌), ఐఆర్‌, పీఎం ఎ.ఆనందరావు, జీఎం (ఫైనాన్స్‌) సుబ్బారావు, ఏజీఎం (ఫైనాన్స్‌) రాజేశ్వరరావు, డీజీఎం (ఫైనాన్స్‌)కొమరయ్య, చీఫ్‌ లైజన్‌ ఆఫీసర్‌ బి.మహేశ్‌, సీనియర్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌గణాశంకర్‌ పూజారి, ఎస్‌.బి.ఐ. నుంచి జీఎంలు ఫణీంద్ర నాథ్‌, జుగేశ్‌ చంద్ర సాహూ, కిషన్‌ శర్మ, డీజీఎంలు రవీందర్‌ గోరవ్‌, రవిశంకర్‌ ఆకెళ్ల, ఏజీఎం దినేశ్‌ గుర్నాథ్‌, చీఫ్‌ మేనేజర్లు వరదరాజులు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like