సింగ‌రేణి కార్మికుల‌కు అండ‌గా ఉంటా : రేవంత్‌రెడ్డి

సింగ‌రేణి కార్మికుల‌కు అండ‌గా ఉంటాన‌ని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నేత‌లు ఆయ‌నను క‌లిసి సింగ‌రేణి కార్మికుల స‌మ‌స్య‌లు, మూడు రోజుల స‌మ్మె విష‌యం ఆయ‌న దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌ల‌ను వేలం వేస్తున్న‌ద‌ని, దానిని వ్య‌తిరేకిస్తూ ఈ నెల 9,10,11 తేదీల్లో జరగనున్న సమ్మెకు కాంగ్రేస్ మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని విజ్ఞ‌త‌ప్తి చేశారు. బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల 45,000 మంది కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంద‌న్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ తో పాటుగా బొగ్గు గనుల ప్రమాదంలో చనిపోతే కోటి రూపాయల ప్రత్యేక ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. డిపెండెంట్ ఉద్యోగుల వయోపరిమితిని 35 నుండి 40 సం.లకు పెంచాలని కోరారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో మరియు అండర్ గ్రౌండ్ గనులలో తక్షణం కాంట్రాక్టీకరణను నిలిపివేయాలనే తదితర డిమాండ్లను కూడా యాజమాన్యం ముందు ఉంచినట్లు వారు స్ప‌ష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నందువ‌ల్ల సింగరేణి సంస్థను కాపాడేందుకు పార్లమెంటులో ప్రస్తావించి సింగరేణి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రేవంత్ రెడ్డిని కోరారు.

సింగరేణి కార్మికులకు అండగా ఉంటా ౼ రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తును కాపాడటానికి తనవంతు కృషి చేస్తానని స్ప‌ష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి చర్యల వలన దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి సింగరేణిని కాపాడుకోవడానికి ఈ అంశాన్ని తప్పక పార్లమెంట్లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.

రేవంత్‌రెడ్డిని క‌లిసిన వారిలో ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ. జనక్ ప్రసాద్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, హెచ్ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సీఐటీయూ అధ్యక్షుడు మంద నర్సింహా రావు త‌దిత‌రులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like