సింగరేణికి ఐఐఐఈ పెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

-గోవాలో జరిగిన 22వ సీఈవోల సదస్సులో ప్రదానం
-సీఅండ్‌ ఎండీ ఎన్‌.శ్రీధర్‌ అభినందనలు

సింగరేణి కాలరీస్‌ సంస్థకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. 2021-22 సంవత్సరానికి ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ (ఐఐఐఈ) వారు ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌ లెన్స్‌ అవార్డును సింగరేణి సంస్థకు ప్రదానం చేశారు .

ఈ నెల 6 నుంచి 8 వరకు గోవాలో జరిగిన ఐఐఐఈ 22వ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల (సీఈవో) సదస్సులో గోవాకు చెందిన ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో లారెంకో చేతుల మీదుగా సింగరేణి తరఫున అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి, డీజీఎం (ఐఈ) భాస్కర్‌ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. రాష్ట్రీయ కెమికల్స్‌ ఫర్టిలైజర్స్‌, నైవేలీ లిగ్నైట్‌ కార్పోరేషన్‌, ఇస్రో, ఓఎన్జీసీ, టాటా మోటర్స్‌ తదితర 30 సంస్థలు పాల్గొన్న సదస్సులో సింగరేణికి అవార్డు దక్కడం విశేషం.

సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్ నాయకత్వంలో కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 65 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి, 26 వేల కోట్ల టర్నోవర్‌ ను సాధించి దేశంలోని ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో అగ్రగామిగా నిలిచిన సింగరేణి పనితీరును నిర్వాహకులు కొనియాడారు. దక్షిణ భారత దేశంలో ఇంధన అవసరాలను తీర్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. ఎప్పటికప్పుడు యంత్రాల పనిగంటలను మెరుగపరచడం, మానవ వనరుల సక్రమ వినియోగానికి సాంకేతికతను అందిపుచ్చుకుంటోందని నిర్వాహకులు ప్రశంసించారు.

బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా దేశంలో థర్మల్‌, సోలార్‌ రంగాల్లోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు సంస్థగానూ సింగరేణి గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలోనూ సింగరేణి ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

సీఅండ్ఎండీ శ్రీ‌ధర్‌ హర్షం..
సింగరేణికి పెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌ లెన్స్‌ అవార్డు లభించడంపై సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. గోవాలో ప్రదానం చేసిన అవార్డును సోమవారం అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్ ఎన్‌.భాస్కర్‌ సంస్థ ఛైర్మన్‌ కు అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ సింగరేణిని దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like