సింగ‌రేణిలో 50 వేల కోట్ల కుంభ‌కోణం

-నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నైనీబ్లాక్ ప్రైవేటు సంస్థ‌ల‌కు
-ఇది రాఫెల్ కంటే పెద్ద కుంభ‌కోణం
-అవినీతి అక్ర‌మాల‌కు సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్ అండ‌
-అందుకే ఆయ‌న‌ను కొన‌సాగిస్తున్నారు
-తెలంగాణ‌లో అవినీతిపై కేంద్ర‌మంత్రి కూడా చేతులెత్తేశారు
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

మంచిర్యాల : సింగ‌రేణిలో వేల కోట్ల అవినీతి జ‌రుగుతున్నా క‌నీసం ప‌ట్టించుకున్న నాథుడే లేడ‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న సోమ‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. సింగ‌రేణికి కేటాయించాల్సిన బొగ్గు బ్లాక్‌ల‌ను కేంద్రం అమ్మాల‌ని చూస్తే రాష్ట్రం ప‌రోక్షంగా ప్రోత్స‌హిస్తోందని దుయ్య‌బ‌ట్టారు. బొగ్గుబ్లాక్‌ల ప్రైవేటీక‌ర‌ణ అంశం పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావించ‌కుండా టీఆర్ఎస్ స‌హ‌క‌రించింద‌ని దుయ్య‌బట్టారు. ఒడిషాలో నైనీ బ్లాక్‌లో సింగ‌రేణి బొగ్గు త‌వ్వ‌కాల‌కు పాల్ప‌డ‌కుండా వేరే వారికి 25 సంవ‌త్స‌రాల‌కు ప్రైవేటు వ్య‌క్తుల‌కు లాంగ్ లీజ్‌కు ఇవ్వ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ అనుయాయుల‌కు, అనుకూలురుల‌కు 50 వేల కోట్ల రూపాయ‌లు దోచిపెట్ట‌డానికి తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. సింగ‌రేణి సంస్థ‌ను దోచేందుకు కేసీఆర్ త‌న అధికారాన్ని వినియోగిస్తున్నార‌ని అన్నారు.

సింగ‌రేణి సీఅండ్ఎండీగా శ్రీ‌ధ‌ర్‌ 2016 జ‌న‌వ‌రి 1న బాధ్య‌త‌లు స్వీక‌రించార‌ని చెప్పారు. ఒక ఐఏఎస్ అధికారి మొద‌ట మూడు సంవ‌త్స‌రాలు, త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో మ‌రో రెండు సంవ‌త్స‌రాలు ప‌ని చేసే అవ‌కాశం ఇవ్వొచ్చన్నారు. శ్రీ‌ధ‌ర్‌ను సింగ‌రేణి సీఅండ్ ఎండీగా తొల‌గించాల‌ని కేసు వేస్తే ఇది కార్పొరేష‌న్ కాబ‌ట్టి, ఇది రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిచే సంస్థ కాబ‌ట్టి ఏడు సంవ‌త్స‌రాలు కొన‌సాగించ‌వ‌చ్చ‌ని కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసి మ‌రీ రాష్ట్ర ప్ర‌భుత్వం అత‌న్ని కొన‌సాగిస్తోంద‌న్నారు. సీఅండ్ఎండీ ఏడు సంవ‌త్స‌రాలు ప‌నిచేయ‌వ‌చ్చ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక వాద‌న తీసుకువ‌స్తే దానిని మోదీ సైతం ఆమోదించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు ఏడేండ్ల కాలం కూడా సీఅండ్ఎండీ ప‌ద‌వీకాలం పూర్త‌య్యింద‌ని చెప్పారు. మ‌ళ్లీ మ‌రో సంవ‌త్స‌రం అత‌న్ని తిరిగి నియ‌మించార‌ని అన్నారు. దాదాపు 200 మంది ఐఏఎస్ అధికారులు ఉంటే ఒకే అధికారిని ఎనిమిది సంవ‌త్స‌రాలుగా అత‌న్నే కొన‌సాగించ‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఎందుకు ఈ అధికారి మీద ఇంత ప్రేమా..? ఇంత అనుబంధం..? అని ప్ర‌శ్నించారు.

ఒడిషాలోని నైనీ బ్లాక్‌కు సంబంధించి త‌న అనుచ‌రుల‌కు దోచిపెట్టేందుకే శ్రీ‌ధ‌ర్‌ను అక్క‌డ ఉంచార‌ని దుయ్య‌బ‌ట్టారు. అది 25 ఏండ్లు ప్రైవేటు వ్య‌క్తుల‌కు ఎండీవో కింద అప్ప‌గించేందుకు కుట్ర పూరితంగా చేస్తున్నార‌ని అన్నారు. నైనీ బ్లాక్‌కు సంబంధించి ఇవ్వాల్సిన టెండ‌ర్లు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పిలిచేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. టెండ‌ర్లు పిలిచేందుకు ప్రీ బిడ్డింగ్ మీటింగ్ ఏర్పాటు చేస్తే 17 సంస్థ‌లు వ‌చ్చాయ‌న్నారు. వారికి సింగిల్ ఎంటీటీని మాత్ర‌మే అనుమ‌తిస్తార‌ని సీఅండ్‌ఎండీ చెప్పార‌ని వెల్ల‌డించారు. గ‌తంలో కోల్‌గేట్ స్కామ్ జ‌రిగిన‌ప్పుడు వాటి మీద పార్ల‌మెంట్ ప‌లు సూచ‌న‌లు చేసింద‌న్నారు. జాయింట్ వెంచ‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని, క‌న్సార్సియ‌మ్స్ కు అనుమతి ఇవ్వాల‌ని చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. స్టాండింగ్ క‌మిటీ ఇచ్చిన సిఫార‌సుల‌ను కోల్ఇండియా అదే విధంగా చేస్తోంద‌న్నారు. దేశం మొత్తం మీద ఇలాగే జ‌రుగుతోంద‌ని అన్నారు.

ఈ నిబంధ‌న‌ల విష‌యాన్ని ప్రీ బిడ్డింగ్ స‌మావేశంలో పాల్గొన్న కంపెనీలు సీఅండ్ఎండీ దృష్టికి తీసుకువెళ్తే జాయింట్ వెంచర్లు, క‌న్సార్సియ‌మ్స్ లేకుండా సింగిల్ ఎంటీటీని అనుమ‌తిస్తామ‌ని చెప్పారని రేవంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్ని నిబంధ‌న‌ల‌ను కాల‌రాసి ఒక సంస్థ‌కు అనుకూలంగా ఉండేలా చూశార‌న్నారు. ఇది రాఫెల్ కంటే పెద్ద కుంభ‌కోణ‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న కోల్ స్కాంపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండడం ఎందుకని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తాను ప్రధానికి.. కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామ‌న్నారు. దీనిపై కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి తాము చేసేది ఏమీ లేద‌ని ప్ర‌ధాని కార్యాల‌యం చూసుకుంటుంద‌ని చెప్పార‌ని వెల్ల‌డించారు. క‌నీసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ఫిర్యాదు పంపించండి అని అడిగితే అది కూడా చేయ‌లేదని కేంద్ర‌మంత్రి చెప్పారంటే అర్ధం చేసుకోవ‌చ్చ‌న్నారు. ప్రధానికీ, కేసీఆర్‌కీ ఎంత అనుబంధం ఉందో దీని ద్వారా అర్దం అవుతుంద‌న్నారు. శ్రీధర్ నిర్ణయాలతో జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందని స్ప‌ష్టం చేశారు.

కేసీఆర్-మోడీకి అసలు పడనప్పుడు సింగరేణి సంస్థ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. అదాని దగ్గర కరెంట్ కొనాలని మోదీ ఒత్తిడి పెంచుతున్నారు అని కేసీఆర్ చెప్తున్నారు…? మరి సింగరేణి బొగ్గు ను అదానీ కి కట్టపెడుతుంటే నీకు కనిపించడం లేదా..? అని రేవంత్ ప్రశ్నించారు. భూగర్భ గనుల ను కేసీఆర్ కుటుంబం దోచేస్తోందన్నారు. కేంద్రం ఎందుకు నివేదిక అడగలేదన్నారు. కేంద్రం వాటా ఉన్న సంస్థ లో 50 వేల కోట్ల అవినీతి జరుగుతుంటే ఎందుకు మోడీ స్పందించడం లేదు. అమిత్ షా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని దుయ్య‌బ‌ట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like