35 ఏళ్లు దాటిన డిపెండెంట్ల కు కారుణ్య నియామకాల్లో అవకాశం

-కరోనాతో మరణించిన పొరుగు సేవల సిబ్బంది కుటుంబీకులకు రూ.15 లక్షల ఎక్స్‌ గ్రేషియా
-తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైనా పిల్లలకు వారసత్వ ఉద్యోగ అవకాశం
-అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో సింగరేణి యాజమాన్యానికి- కార్మిక సంఘాలకు మధ్య తొమ్మిది అంశాలపై చరిత్రాత్మక ఒప్పందం
-15 ఏళ్లలో తొలిసారిగా అన్ని కార్మిక సంఘాలతో సానుకూల ఒప్పందం
-యాజమాన్య సానుకూల వైఖరిపై కార్మిక సంఘాల హర్షం
-సామ‌స‌ర్య‌ధోర‌ణితో సమస్యల పరిష్కారం : డైరెక్టర్‌ (పర్సనల్‌) బలరామ్‌

సింగరేణిలో ఇటీవల అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై దశల వారీగా జరుగుతున్న చర్చలు బుధవారం సఫలీకృతమయ్యాయి. అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్ లక్ష్మణ్‌ సమక్షంలో బుధవారం హైదరాబాద్‌ లో సింగరేణి యాజమాన్యానికి, ఆరు కార్మిక సంఘాలకు మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై గుర్తింపు యూనియన్‌ టీబీజీకేఎస్‌, ప్రాతినిథ్య సంఘం ఏఐటీయూసీ, జాతీయ సంఘాలైన ఐఎస్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, బీఎంఎస్‌ నాయకులు సంతకాలు చేశారు. సింగరేణి యాజమాన్యం తరఫున డైరెక్టర్‌ (పర్సనల్‌, ఫైనాన్స్‌, పి అండ్‌ పి) ఎన్‌.బలరామ్‌, జీఎం (పర్సనల్‌) ఐ.ఆర్‌. & పి.ఎం. ఆనందరావు ఒప్పందంపై సంతకం చేశారు. దాదాపు 15 ఏళ్ల లో తొలిసారిగా అన్ని కార్మిక సంఘాలతో యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం ఇదే మొదటిసారి.

ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఇవే..
– తెలంగాణ లోని నాలుగు బొగ్గు బ్లాక్‌ ల వేలాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కోరేందుకు ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లే కార్మిక సంఘాల నాయకులకు పూర్తి సహకారం అందించేందుకు యాజమాన్యం సమ్మతి తెలిపింది.
– కరోనా సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు మెడికల్‌ బోర్డు నిర్వహించలేదు. ఆ సమయంలో 35 ఏళ్లు దాటిన వారసులకు కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది.
– మణుగూరులో ఓపెన్‌ కాస్టు గని లో డంపర్‌ ప్రమాదం ఘటనలో డిస్మిస్‌ అయిన ఇ.పి. ఆపరేటర్ రకీబ్‌ ను తిరిగి నియమించాలని కార్మిక సంఘాలు కోరిన నేపథ్యంలో యాజమాన్యం అంగీకరిస్తూ కింది స్థాయి ఉద్యోగంలో నియమించేందుకు హామీ ఇచ్చింది.
– మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ అయిన సింగరేణి ఉద్యోగి జీవిత భాగస్వామి ఒకవేళ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, సింగరేణి పాఠశాలల్లో ఉద్యోగం చేస్తున్నా వారి వారసులకు ఉద్యోగం ఇవ్వడానికి ఒక్క అవకాశం కోసం అంగీకరించింది. ప్రస్తుతం అలాంటి వారి దరఖాస్తులను పెండిగ్‌ లో ఉంచారు.. ఈ ఒప్పందం ప్రకారం వన్‌ టైం సెటిల్మెంట్‌ గా వారసత్వ ఉద్యోగం ఇవ్వడానికి యాజమాన్యం పేర్కొంది.
– సింగరేణిలో మారుపేర్లతో కొనసాగుతున్న వారి పేర్లను మార్చుకునే అంశాన్ని న్యాయ శాఖ సలహా అనంతరం గెజిట్‌ / అఫిడవిట్‌ ద్వారా సానుకూల రీతిలో పరిష్కరిస్తామని యాజమాన్యం పేర్కొంది.
– ఈపీ ఆపరేటర్లు, మైనింగ్‌ స్టాఫ్‌ / ట్రెడ్స్‌ మెన్‌ లు మెడికల్‌ అన్ఫిట్‌ అయితే సర్ఫేస్‌ మీద అదే ఉద్యోగం ఇచ్చే అంశాన్ని కంపెనీ అంతర్గత కమిటీ పరిశీలనకు పంపించి 60 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు హామీ ఇచ్చింది.
– వారసత్వ ఉద్యోగ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని యాజమాన్యం పేర్కొంది.
– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కార్పోరేట్‌ శాలరీ అకౌంట్‌ ఉన్న సింగరేణి ఉద్యోగులు గని ప్రమాదాలు, ఇతర ప్రమాదాల్లో మృతి చెందిన పక్షంలో వారి కుటుంబీకులకు రూ.40 లక్షల పరిహారం ఇచ్చేలా ఎస్‌.బి.ఐ.తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఇతర బ్యాంకులు ఈ పరిహారం మొత్తాన్ని పెంచేందుకు ముందుకు వచ్చే అవకాశాలను వెతుకుతున్న‌ట్లు హామీ ఇచ్చారు.
– పొరుగు సేవల విభాగంలో పనిచేస్తూ కరోనా వల్ల మృతి చెందిన వారి కుటుంబీకులకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించింది.

కంపెనీ సుస్థిర అభివృద్ధికి ప్రణాళికలు
సింగరేణి సంస్థకు మరో వందేళ్ల ఉజ్వల భవిష్యత్‌ కోసం సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్‌ సారథ్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నామనీ కంపెనీ ప్రగతికి కార్మిక సంఘాలు సహకరించాలని డైరెక్టర్‌ (పర్సనల్‌,ఫైనాన్స్‌,పిఅండ్‌పి) ఎన్‌.బలరామ్‌ కోరారు. కంపెనీ ఆస్తుల పరిరక్షణకు కార్మిక సంఘాలు ప్రత్యేక చొరవ తీసుకొని సహకరించాలన్నారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు పరిష్కారానికి సహరించిన అన్ని సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. యాజమాన్యం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై అన్ని కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సంస్థ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, బొగ్గుబ్లాక్‌ ల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జీఎం (కోఆర్డినేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌) కె.సూర్యనారాయణ, జీఎం (పర్సనల్‌) ఐఆర్‌, పీఎం ఎ.ఆనందరావు, ఎస్వోటూ డైరెక్టర్ రవిప్రసాద్‌, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్ ఎన్‌.భాస్కర్‌, గుర్తింపు కార్మిక సంఘం నుంచి బి.వెంకట్రావ్‌, కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి, ప్రాతనిథ్య సంఘం నుంచి వి.సీతారామయ్య,కె.రాజ్ కుమార్‌, ఐఎన్‌ టీయూసీ నుంచి బి.జనక్‌ ప్రసాద్‌, ఎస్‌.నర్సింహారెడ్డి, హెచ్‌ఎంఎస్‌ నుంచి రియాజ్‌ అహ్మద్‌, డి.రమేశ్‌, సీఐటీయూ నుంచి మందా నర్సింహా రావు, నాగరాజు గోపాల్‌, బీఎంఎస్‌ నుంచి వై.సత్తయ్య, వి.రవీందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like