సింగ‌రేణిలో నిర‌స‌న‌లు విజ‌య‌వంతం చేయండి

సింగ‌రేణి వ్యాప్తంగా మూడు రోజుల పాటు జ‌రిగే నిర‌స‌న‌లు విజ‌య‌వంతం చేయాల‌ని ప‌లువురు కార్మిక సంఘ నేత‌లు స్ప‌ష్టం చేశారు. కార్మిక హక్కుల కోసం జేఏసీ పిలుపు మేరకు 18,19,20 తేదీలలో ఈ నిర‌స‌న‌లు కొన‌సాగుతాయ‌న్నారు. ఆదివారం సింగరేణి జేఏసీ సమావేశం గోలేటిలో ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది. ఈ సంద్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగె ఉపేందర్, ఇఫ్టూ బెల్లంపల్లి ఏరియా అధ్యక్షుడు బండారి తిరుపతి, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్తేం రాజబాబు మాట్లాడుతూ సింగరేణిలో దాదాపు 30వేల మంది కాంట్రాక్టు కార్మికులు చాలీచాల‌ని వేత‌నాల‌తో ప‌నిచేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాదాపు ప‌దిహేను సంవ‌త్స‌రాల నుంచి వారి గురించి ప‌ట్టించుకున్న నాథుడే లేడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యాజమాన్యం కార్మిక చట్టాలను అమలు చేయకుండా శ్రమ దోపిడి చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. యాజమాన్యం వెంటనే హైపవర్ కమిటీ వేతనాలు లేదా జీవో 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగభద్రత, జాతీయ సెలవులు, చట్టబద్ద హక్కులు, కార్మికులందరికి వారి కుటుంబ సభ్యులతో పాటు కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పించాలని అన్నారు. గ‌ని ప్ర‌మాదంలో మరణిస్తే కార్మికులకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కార్మికులందరికి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఖాళీగా ఉన్న ఇండ్లు కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల పాటు జ‌రిగే నిర‌స‌న‌లు విజ‌య‌వంతం చేయాల‌ని, ఫిబ్రవరి 12 నుంచి హక్కుల సాధన కోసం జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు చల్లూరి అశోక్, సాగర్ గౌడ్, పోశం, సిరికొండ భూమేష్, రాజశేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like