సింగ‌రేణిలో తెలంగాణ అధికారికి అన్యాయం

తెలంగాణ ఉద్య‌మంలో ఆయ‌న ముందుండి పోరాటం చేశారు. ఉద్య‌మం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో సింగ‌రేణి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అయితే ఆంధ్రా ఆధిప‌త్యం అధికంగా ఉన్న కార్పొరేట్ కార్యాల‌యంలో మాత్రం జై తెలంగాణ అనేందుకు ఎవ‌రూ సాహసం చేయ‌లేదు. కానీ, ఆయ‌న జై తెలంగాణ నినాదంతో ఒక్క‌డే ముందుకు వ‌చ్చారు. ఆయ‌న ఇంటి పేరు చాలా మందికి తెలియ‌దు.. కానీ, తెలంగాణ శ్రీ‌నివాస్ అంటే అంద‌రూ గుర్తు ప‌డ‌తారు. అలాంటి వ్య‌క్తిని కొంద‌రు ఆంధ్రా అధికారులు క‌క్ష‌గ‌ట్టి వేరే చోటికి పంపించారు. త‌న‌కు అండ‌గా ఉంటుద‌నుకున్న యూనియ‌న్ సైతం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆవేద‌న‌తో రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది..

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర..
తెలంగాణ శ్రీ‌నివాస్ ఈ పేరు సింగ‌రేణిలో చాలా మందికి సుప‌రిచిత‌మే. కింది స్థాయి నుంచి ఎదిగిన వ్య‌క్తిగా ఆయ‌న‌కు ఎంతో పేరుంది. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి సింగ‌రేణి ఉద్యోగం సంపాదించారు. 2001లో ఆయ‌న సింగ‌రేణిలో సెక్ర‌టేరియ‌ట్ అధికారిగా పోస్టింగ్ సంపాదించారు. సింగ‌రేణిలో క‌ష్ట‌ప‌డి కంపెనీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన చీఫ్ ఆఫ్ సెక్రటరీగా ఉద్యోగోన్నతి పొందారు. ఆ స్థాయిలో ఉన్న వ్య‌క్తికి సైతం వేధింపులు త‌ప్ప లేదు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ముఖ్యంగా 2009 ప్రాంతంలో ఎన్నో కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు. వాళ్ల కార్యాల‌యంలో ఉద్య‌మానికి సంబంధించి ఆందోళ‌న‌ల్లో సైతం పాల్గొన్నారు. ఆయ‌న‌పై విజిలెన్స్ దాడులు, త‌ప్పుడు ఛార్జీషీట్లు, వార్నింగ్ లెట‌ర్లు, బ‌దిలీ చేస్తామ‌నే భ‌య‌బ్రాంతులు ఇలా అన్ని ఎదుర్కొన్నారు.

వీడ‌ని ఆంధ్రా నీడ‌లు…
తెలంగాణ వ‌చ్చింది.. ఇక తెలంగాణ ప్రాంత అధికారుల‌కు మంచి జ‌రుగుతుంద‌నుకుంటే ఆంధ్రా అధికారుల నీడ‌లు, ఛాయ‌లు ఇంకా వీడ‌టం లేదు. తెలంగాణ ప్రాంతం వారిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దానిని నిజం చేస్తూ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా తెలంగాణ శ్రీనివాస్‌ను నిబంధనలను పక్కన పెట్టి మ‌రీ యాజమాన్యం విజయవాడలోని ఆప్మెల్ కంపెనీకి బదిలీ చేసింది. ఏడాదిన్నర కాలంగా ఆయన అక్కడ పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని మొత్తుకున్నా క‌నీసం ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఎదుర్కొని ధైర్యంగా నిల‌బ‌డిన ఆయ‌న తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత సైతం అవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధికారుల సంఘం వీడి.. బ‌య‌ట‌కు..
త‌న‌ను అన్ని ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేసినా బొగ్గు గనుల అధికారుల సంఘం (సీఎంఓఏఐ) క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల ఆయ‌న ఆవేద‌న‌కు గుర‌య్యారు. రెండు రోజుల కింద‌ట ఆ సంఘానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పనిచేస్తున్న కళ్లు, చెవులు లేని సంఘంలో తాను ఇమడలేనని, తనకు జరిగిన అన్యాయంపై కనీసం సానుభూతి కూడా చూప కుండా అధికారుల సంఘం అత్యంత అమానవీ యంగా వ్యవహరించిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మౌఖికంగా, రాత పూర్వకంగా తన పరిస్థితి గురించి ఫిర్యాదు చేసినా తనకు ఏమాత్రం న్యాయం చేయలేని సంఘంలో ఉండి ఉపయోగం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి ఒక ఉన్నతాధికారి రాజీనామా చేయడం సింగ రేణిలో చర్చనీయాంశంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like