సింగరేణి పనితీరు చాలా బాగుంది

బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్‌, సోలార్‌ రంగాలలో సింగరేణి ప్రగతి ప్రశంసనీయం - ఇతర రాష్ట్రాలకూ సింగరేణి విస్తరించాలి - కేంద్ర బొగ్గు, రైల్వే, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్‌ పాటిల్‌ దాన్వే

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ పనితీరు తనను ముగ్దున్ని చేస్తోందని, బొగ్గు ఉత్పత్తిలోనే కాక థర్మల్‌, సోలార్‌ విద్యుత్తు రంగాల్లో కంపెనీ ప్రగతి ప్రశంసనీయమని కేంద్ర బొగ్గు, రైల్వే, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్‌ పాటిల్‌ దాన్వే పేర్కొన్నారు. హైద్రాబాద్‌లో సోమవారం సింగరేణి కాలరీస్‌ కంపెనీపై సంస్థ ఛైర్మన్‌ అండ్‌ ఎం.డి. శ్రీధర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మాట్లాడారు.

సింగరేణి ఎన్నో దశాబ్దాలుగా బొగ్గు ఉత్పత్తిలో ఉన్న సింగరేణి ఆరు సంవత్సరాలుగా సాధించిన వృద్ధి ప్రశంసనీయమన్నారు. జాతి సేవలో బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్‌, సోలార్‌ రంగాల్లో సేవలందిస్తున్న సింగరేణి ఉద్యోగులను, అధికారులను, కార్మికులను ప్రత్యేకించి అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ గురించి, సాధిస్తున్న ప్రగతి గురించి సంస్థ సి అండ్‌ ఎం.డి శ్రీధర్‌తో పాటు డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రతీ అంశంపైన కేంద్రమంత్రి శ్రీ దాన్వే ప్రత్యేక ఆసక్తి కనపరుస్తూ, పూర్తి వివరాలు తెలుసుకొన్నారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ తో పాటు సోలార్‌ పవర్‌ ఉత్పత్తిలోకి కూడా అడుగుపెట్టడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చని సూచించారు.

సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో నైనీ, న్యూపాత్రపద బ్లాకులు చేపట్టిన విషయాన్ని వివరించగా, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు బ్లాకులు చేపట్టాల‌ని కోరారు. సింగరేణి చేపట్టిన పర్యావరణ హిత చర్యలు, ఓవర్‌ బర్డెను నుండి ఇసుక తయారీ, సి.ఎస్‌.ఆర్‌. నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌తో మాట్లాడుతూ త్వరలోనే తాను సింగరేణిని సందర్శించాలను కొంటున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో లేదా ఆ తర్వాత సింగరేణి గనులను, సోలార్‌ కేంద్రాలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని కూడా సందర్శిస్తానని తెలిపారు. దేశ, ఇంధన అవసరాలు తీర్చడంలో సింగరేణి చేస్తున్న బహుముఖ కృషి ఇతరులకు ఆదర్శ ప్రాయమన్నారు. సమీక్షా సమావేశంలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌, పర్సనల్‌) ఎన్‌.బలరామ్‌, డైరెక్టర్‌ (ఇ అండ్‌ ఎం) సత్యనారాయణరావు, ఇ.డి. (కోల్‌ మూమెంట్‌) ఆల్విన్‌, జి.ఎం. (కో ఆర్డినేషన్‌) సూర్యనారాయణ పాల్గొన్నారు.

కోలిండియా ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి

ఆ తర్వాత వీడియో కాన్పరెన్సు ద్వారా కోల్‌కతాలో జరుగుతున్న 47వ కోల్‌ ఇండియా వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. హైద్రాబాద్‌ నుంచి ఆయన తన సందేశం ఇస్తూ కోలిండియా దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోందని, ఈ దిశగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాలని కోరారు. దేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ఎటువంటి కోరత లేకుండా బొగ్గును అందించే బాధ్యతను ప్రభుత్వరంగ సంస్థలు సమర్ధంగా నిర్వహించాలన్నారు. 2025 నాటికి 1000 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి స్థాయికి కోలిండియా ఎదగాలని ఆకాంక్షించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like