సింగ‌రేణి వ్యాప్తంగా నిరాహార దీక్ష‌లు

-రేపు సింగ‌రేణి ప్రాంతాల్లో నిరాహార దీక్ష‌లు
-పాల్గొన‌నున్న ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు
-విజ‌య‌వంతం చేసేలా టీబీజీకేఎస్ నేత‌ల ప్ర‌ణాళిక‌లు

మంచిర్యాల : బొగ్గు బ్లాక్‌ల వేలంపై కేంద్రాన్ని ఇర‌కాటంలో పెట్టాల‌ని భావిస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా పావులు క‌దుపుతోంది. ఆరు జిల్లాల్లో విస్త‌రించిన సింగ‌రేణి సంస్థ‌తో వేలాది మంది ఉద్యోగుల భ‌విష్య‌త్తు ముడిప‌డి ఉంది. అదే స‌మ‌యంలో సింగ‌రేణి విస్త‌రించిన ప్రాంతాల్లో ఉద్యోగుల‌ను న‌మ్ముకుని ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మంది జీవ‌నం సాగిస్తుంటారు. దీంతో సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌పై గ‌ళం ఎత్తాల‌ని భావిస్తోంది. అలా చేస్తే జ‌రుగుతున్న అన్యాయం ప్ర‌జ‌లకు చెప్ప‌డంతో పాటు ఖ‌చ్చితంగా అది త‌మ‌కు లాభిస్తుంద‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేర‌కు ముందుకు సాగుతోంది.

సింగ‌రేణి వ్యాప్తంగా కొన‌సాగుతున్న నిర‌స‌న‌లు మ‌రింత ఉధృతం చేయాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. సింగ‌రేణి సంస్థ‌లో ఇప్ప‌టికే టీఆర్ఎస్ ఆందోళ‌న బాట ప‌ట్టింది. ఆ పార్టీ అనుబంధ యూనియ‌న్ తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌నలు కొన‌సాగుతున్నాయి. డిసెంబ‌ర్ 9 నుంచి 11 వ‌ర‌కు మూడు రోజుల పాటు బంద్ పిలుపు ఇచ్చింది. వారం రోజుల కింద‌ట కేంద్ర ప్ర‌భుత్వ దిష్టి బొమ్మ ద‌హ‌నాలు, సంత‌కాల సేక‌ర‌ణ ఉద్య‌మానికి పిలుపునిచ్చింది. ఇక క‌ర‌ప‌త్రాల పంపిణీ కార్మికుల్లో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. సింగ‌రేణికి ద‌క్కాల్సిన బొగ్గు బ్లాక్‌ల‌ను ప్రైవేటీక‌రిస్తోంద‌ని, కార్మిక వ్య‌తిరేక విధానాలు అవ‌లంబిస్తోంద‌ని ఆ యూనియ‌న్ దుయ్య‌బ‌డుతోంది. కేంద్రానికి వ్య‌తిరేకంగా కార్మికుల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇక సింగ‌రేణి వ్యాప్తంగా నిరాహార దీక్ష‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 9న ఈ దీక్ష‌లు చేప‌డ‌తారు. అన్ని గ‌నులు, ఓపెన్‌కాస్టులు, డిపార్ట్‌మెంట్లు, కార్మిక ప్రాంతాల్లో దీక్ష‌లు చేయ‌నున్నారు. దీనికి తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘ నేత‌ల‌తో పాటు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు, నేత‌లు హాజ‌ర‌వుతారు. నిత్యం ఆందోళ‌న ద్వారా కేంద్రానికి సెగ త‌గిలేలా చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీక‌ర‌ణ ఉప‌సంహ‌రించే వ‌ర‌కు త‌గ్గేది లేద‌ని టీఆర్ఎస్‌, టీబీజీకేఎస్ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

రేపు మంద‌మ‌ర్రి మార్కెట్ ఏరియాలో బాల్క సుమ‌న్ దీక్ష చేయ‌నున్నారు. ఇక బెల్లంప‌ల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య దీక్ష‌లో పాల్గొంటారు. వారితో పాటు మిగ‌తా టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నేత‌ల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు సైతం దీక్ష చేయ‌నున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like