సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు

కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కి కరోనా సోకి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.

ఈ మద్య సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతలకు లోనయ్యారు. వెంటనే ఆయన్ని కిమ్స్ ఆస్పత్రి చేర్పించారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. శ్వాస సంబంధ సమస్యతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఆయన పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి.

సినీ గేయ ర‌చ‌యిత‌గా సిరివెన్నెల 1986లో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. ఆయన తొలి చిత్రం సిరివెన్నెల. తొలి చిత్రంలోనే విరించినై విరచించితిని, విధాత తలపున ప్రభవించినది.. లాంటి పదప్రయోగాలు ఎన్నో ఆయన చేశారు. అంతే కాదు ఈ చిత్రం పేరునే తన ఇంటిపేరు గా మార్చుకున్నారు. ఈ చిత్రానికి ఆయ‌న‌కు ఉత్త‌మ లిరికిస్ట్‌గా నంది అవార్డు వ‌చ్చింది. దాదాపు 36 ఏళ్ల సినీ ప్రస్థానంలో వేలాది పాటలు ఆయన రాశారు. తెలుగు చిత్ర రంగానికి చేసిన సేవలకు గాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిరివెన్నల పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

పాట ఎలాంటిదైనా అందులో తెలియ‌ని ఓ స్ఫూర్తిని నింపి రాయ‌డం ఆయ‌న పెన్నుకున్న గొప్ప అల‌వాటు. అందుకనే తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ఆయ‌నెంతో ప్రీతిపాత్రుడ‌య్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి గొప్ప రచయిత మళ్లీ పుట్టరని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ఇండస్ట్రీనే కాదు.. తెలుగు ప్రేక్షకాభిమానులు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like