సోమగూడెంలో ఖాళీ స్థలాల కబ్జా

-ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు చేప‌డుతున్న స్థానికులు
-ప్ర‌జాప్ర‌తినిధుల అండ‌దండ‌ల‌తో మౌనం వ‌హిస్తున్న అధికారులు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం కొత్త కాలనీలో ఖాళీ స్థలాల్లో కొంద‌రు నిర్మాణాలు చేప‌డుతున్నారు. వీరికి ప్ర‌జాప్ర‌తినిధుల అండ‌దండ‌లు ఉండ‌టంతో అధికారులు మౌనం వ‌హిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

సోమ‌గూడెం పాత‌బ‌స్తీలో 20 ఏండ్ల కింద‌ట పెద్దఎత్తున వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. దీంతో చాలా మంది న‌ష్ట‌పోయారు. వారికి పునరావాసం ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం, కొంద‌రికి సోమగూడెం కొత్త కాలనీలో ప్లాట్లను కేటాయించింది. ఇందులో కొంతమంది ఇళ్లను నిర్మించుకున్నారు. కొంత మంది గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో గ్రామంలో కొన్ని స్థలాల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఖాళీగా ఉండ‌టంతో కొంద‌రు క‌న్ను వాటిపై పడింది. దీంతో ఒకరిని చూసి ఒకరు ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారు.

కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల అండ‌దండ‌ల‌తో ఈ స్థ‌లాల క‌బ్జాలు చేస్తున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు వ‌ర్గాల వారీగా వర్గాలుగా విడిపోయి ఈ క‌బ్జాలు చేసుకున్న వారికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు. దీంతో గ్రామంలో ఎప్పుడు ఎలాంటి గొడ‌వ జ‌రిగే ప‌రిస్థితి త‌లెత్తుతుందోన‌ని జ‌నం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో ప్ర‌జాప్ర‌తినిధులు ఉండ‌టంతో అధికారులు సైతం మౌనంగా ఉంటున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఇప్ప‌టికైనా అధికారులు ఈ విష‌యంలో చొర‌వ తీసుకుని ఖాళీగా ఉన్న ప్లాట్ల‌ను ఇండ్లు లేని నిరుపేద‌ల‌కు కేటాయించాల‌ని ప‌లువురు కోరుతున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు సైతం ఈ విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట వేసి పేద వారికి న్యాయం జ‌రిగేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like