ఎమ్మెల్సీగా శ్రీ‌కాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌

Srikantha Chary : తెలంగాణ అమరవీరుడు శ్రీకాంచారి తల్లి శంకరమ్మకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జ‌రిగిన ప‌రిణామాలు గ‌మ‌నిస్తే పూర్తి స్థాయిలో ఆమెకు ఎమ్మెల్సీ అవ‌కాశం క‌ల్పించేందుకు కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారనే వాద‌న‌ల‌కు బ‌లం చేకూరుతుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్‌రెడ్డి ఆమెను ప్రగతి భవన్ తీసుకువ‌చ్చారు. శంకరమ్మకు కీలక పదవి ఇస్తామని బీఆర్‌ఎస్ అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, తనకిచ్చిన హామీని నెరవేర్చడంలో జాప్యం జరగడంతో.. కేసీఆర్ ప్రభుత్వంపై శంకరమ్మ గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొద్ది రోజులుగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రోజుకొక కార్యక్రమాన్ని ఎంపిక చేసి ఈ వేడుకలను నిర్వహించారు. శ్రీకాంతాచారి విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మొద‌టి నుంచి విమ‌ర్శ‌లు సాగుతున్నాయి. అమ‌రుల కుటుంబాల‌కు మాత్రం మేలు జ‌ర‌గ‌లేద‌ని ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా గుర్తు చేశారు. ఈ విమర్శలకు చెక్ పెట్టేవిధంగా బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సరైన సందర్భాన్ని ఎంచుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజును అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో, పట్టణాల్లో అమరులకు నివాళి అర్పించి, మౌనం పాటిస్తారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై నిర్మించిన అమరవీరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్.. గురువారం ఆవిష్కరించనున్నారు. ఇందు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇదే సందర్భంలో తెలంగాణ వచ్చినా, అమరుల కుటుంబాలకు మేలు జరగలేదనే విమర్శలను తిప్పికొట్టే విధంగా బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

శంకరమ్మకు 2014లో బీఆర్‌ఎస్ పార్టీ హుజుర్‌నగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, హుజుర్‌నగర్ ఉపఎన్నిక సమయంలోనూ టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు కురిపించారు. తాజాగా ఆమెకు ఎమ్మెల్సీ కేటాయిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆమెకు ఒక పీఏ, గ‌న్‌మెన్‌ను కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. శంక‌ర‌మ్మ‌కు ప్ర‌భుత్వ వాహ‌నం కూడా కేటాయించిన‌ట్లు స‌మాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like