“స్టార్” తిరిగేనా..?

-దూకుడు త‌గ్గిన ఏఐటీయూసీని కార్మికులు ఆద‌రిస్తారా..?
-కార్మికుల స‌మ‌స్య‌ల‌పై చిత్త‌శుద్ధి లోపించింద‌న్న ఆరోప‌ణ‌లు
-వాసిరెడ్డి వ‌న్‌మాన్ షోతో ఆ యూనియ‌న్‌కు న‌ష్టం
-కేవ‌లం టీబీజీకేఎస్‌పై వ్య‌తిరేక‌త‌పైనే ఆశ‌లు

మంచిర్యాల :సింగ‌రేణి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏఐటీయూసీ సిద్ధం అవుతోంది. ఇప్ప‌టికే ద్వితీయ శ్రేణి నేత‌ల‌కు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సి వ్యూహాలు, ఇత‌ర వ్య‌వ‌హారాల‌పై దృష్టి సారించారు. అయితే యూనియ‌న్ గెలుపుపై సొంత యూనియ‌న్ నేతలే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆ యూనియ‌న్ లో గ‌తంలో ఉన్న దూకుడు లేద‌ని, కార్మికుల స‌మ‌స్య‌ల‌పై వాసిరెడ్డి ఎక్క‌డా, ఎప్పుడు ప్ర‌త్య‌క్ష పోరాటాల‌కు దిగ‌లేద‌ని అందుకే కార్మికుల‌కు ద‌గ్గ‌ర కాలేక‌పోయామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. టీబీజీకేఎస్‌పై వ్య‌తిరేక‌త ఉన్నా అది త‌మ‌కు అనుకూలంగా మారుతుందా..? లేదా అన్న‌ది ఆ యూనియ‌న్ నేత‌ల‌కే అంతుప‌ట్ట‌డం లేదు.

ఏఐటీయూసీ.. ఈ యూనియ‌న్ పోరాటాలకు కేరాఫ్‌గా నిలిచింది. ఆ యూనియ‌న్ నాయ‌కుల పేర్లు చెబితే చాలు యాజమాన్యం వెన్నులో వణుకు పుట్టేది. ఒక్క పిలుపుతో సింగరేణిలో సమ్మె జరిగేది. సమ్మె నోటీస్‌లో పెట్టిన డిమాండ్లలో 80 శాతానికి పైగా హక్కులను గత్యంతరం లేక యాజమాన్యం ఒప్పుకునేది. 20 ఏళ్ళ కింద‌ట చెప్పుకోదగ్గ స్థాయిలో సాధించిన హక్కులే ప్రస్తుత కార్మికులు అనుభవిస్తున్నారు. కామేడ్ర్ కొంర‌య్య‌, అబ్ర‌హం, పీ.న‌ర్స‌య్య, మాదిరెడ్డి భాస్క‌ర్‌రావు, నారాయ‌ణ‌, అచ్యుత‌న్‌, బాసెట్టి గంగారాం, పోశెట్టి, జే.కుమార‌స్వామి ఇలా ఎంద‌రో నేత‌లు కార్మికుల ప‌క్షాన పోరాటాలు సాగించారు. వారు కార్మికుల కోసం త‌మ స‌ర్వ‌స్వాన్ని ధారపోశారు. త‌మ ర‌క్తంతో ఆ జెండాను మ‌రింత ఎరుపెక్కించారు. కార్మిక సంఘం నేత‌లు కూడా త‌మ‌కున్న విశ్వ‌స‌నీయ‌త‌ అలాగే నిలుపుకున్నారు. దీంతో అటు కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాటు ఇటు ఏఐటీయూసీ యూనియ‌న్ సైతం నిల‌బ‌డింది.

సింగ‌రేణిని ధార‌ద‌త్తం చేస్తున్నా.. ప‌ట్టించుకోలేదు..
ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఏఐటీయూసీ ఖ‌చ్చితంగా పోరాటం చేయాలి. కార్మికుల ప‌క్షాన నిల‌బ‌డాలి. కానీ, సింగ‌రేణి వ్యాప్తంగా ఎక్క‌డా పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. అడ‌పాద‌డ‌పా చిన్న‌చిన్న విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం త‌ప్ప పెద్ద‌గా పోరాటాలు చేసిన ప‌రిస్థితి క‌న‌ప‌డం లేదు. సింగరేణి నిధుల‌ను రాష్ట్ర ప్రభుత్వం, యాజ‌మాన్యం ఇతర రాజకీయప్రయోజనాలకు మళ్లిస్తోంది. షేప్‌ నిధులు, సీఎస్‌ఆర్‌ పథకాలతో ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. డిస్టిక్ట్‌ మినరల్ ఫండ్‌(డీఎంఎఫ్‌) ట్రస్టుకు సైతం దాదాపు వేల కోట్ల రూపాయ‌లు కేటాయిస్తోంది. సింగరేణి ప్రభావిత ప్రాంతాల సంక్షేమానికి కేటాయించిన నిధులను ప్రభుత్వం సింగరేణితో సంబంధం లేని సిద్దిపేట, హైదరాబాద్‌ లాంటి పట్టణాల్లో వినియోగిస్తున్నారు. కోడ్ ఆఫ్ కండ‌క్ట్ పేరు చెప్పి త‌ప్పించుకోవ‌డం మిన‌హా ఏఐటీయూసీ ఎక్క‌డా పోరాటం చేయ‌లేద‌ని ప‌లువురు స్ప‌ష్టం చేస్తున్నారు.

జ‌రిగింది ఏమిటి..? చేసింది ఏమిటి..?
ఇక సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌కు సంబంధించి ఏఐటీయూసీ అనుస‌రించిన తీరు ప‌ట్ల ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ గ‌నుల ప్రైవేటీక‌ర‌ణ‌కు సంబంధించి అన్ని రాష్ట్రల్లో బొగ్గు ఉత్ప‌త్తి చేసే సంస్థ‌లు కేంద్రంతో మాట్లాడుకుని గ‌నులు తీసుకున్నాయి. ఇక్క‌డ సింగ‌రేణి మాత్రం కేంద్రానికి లేఖలు రాయ‌లేదు. సంప్ర‌దింపులు సైతం జ‌ర‌ప‌లేదు. రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోలేదు. వాస్త‌వానికి పోరాటం చేయాల్సింది ఈ అంశంపైన‌. ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం, యాజ‌మాన్యం మీద ఒత్తిడి తేవాల్సిన యూనియ‌న్లు కేవలం కేంద్రంపైనే పోరాటం సాగించాయి. దాని వ‌ల్ల వాస్త‌వానికి ఒరిగింది ఏమీలేదు. కానీ, టీబీజీకేఎస్ ట్రాప్‌లో ప‌డిన ఏఐటీయూసీ అస‌లు విష‌యం మ‌రుగున‌ప‌డేలా చేసింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

గొప్ప‌లు చెప్పి… త‌ప్పించుకుని..
ఏఐయూటీసీ అధినేత వాసిరెడ్డి సీతారామ‌య్య చెప్పింది చేయ‌డ లేద‌ని ప‌లువురు సొంత యూనియ‌న్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ 2018, ఫిబ్రవరి 27 శ్రీరాంపూర్‌లో స‌భ నిర్వ‌హించారు. దీనికి సంబధించి భారీగా నిధులు దుబారా చేశారని హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేస్తామ‌ని వాసిరెడ్డి తెలిపారు. ఆ స‌భ‌కు సింగ‌రేణి యాజ‌మాన్యం రూ.14.53కోట్లకు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిసింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సీతారామ‌య్య ఆ త‌ర్వాత సైలెంట్ అయ్యారు. చాలా విష‌యాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొందని చెబుతున్నారు. వాసిరెడ్డి వ‌న్‌మాన్ షోతో ఆ యూనియ‌న్‌కు మ‌రింత‌గా న‌ష్ట క‌లుగుతోంద‌ని ఆ యూనియ‌న్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లే చెబుతున్నారు. ఆయ‌న యూనియ‌న్‌కు సంబంధించి పోరాటాల గురించి కానీ, ఇత‌ర విష‌యాల్లో ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతున్నారు.

కార్మికుల స‌మ‌స్య‌ల‌పై చిత్త‌శుద్ధి ఏది..?
మెడిక‌ల్ అన్‌ఫిట్ల‌లో ల‌క్ష‌ల్లో చేతులు మారుతున్నాయి. ప్ర‌తి బోర్డుకు కోట్లాది రూపాల‌య అవినీతి జ‌రుగుతోంది. కార్మికుల‌కు ప‌ని స్థ‌లాల్లో భ‌ద్ర‌త లేకుండా పోతోంది. డీఎంఎఫ్‌టీ కింద దాదాపు 2,300 కోట్లు ఆరు జిల్లాల‌కు అందించామ‌ని సింగ‌రేణి చెబుతోంది. ఆ నిధులు ఎక్క‌డ ఖ‌ర్చు చేశారు..? ఏం చేశారు..? ఎలాంటి లెక్క లేకుండా పోతోంది. కొత్త మున్సిపాలిటీల్లో హెచ్ ఆర్ ఏ ఇవ్వ‌డం లేదు. కోల్ ఇండియాలో పెర్స్క్ మీద యాజ‌మాన్యం ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్ చెల్లిస్తుంది. కానీ ఇక్క‌డ అమ‌లు చేయ‌డం లేదు. ప్ర‌తి నెలా వంద‌ల కోట్ల లాభాలు చూపిస్తున్న సంస్థ‌లో జీతాలు చెల్లించ‌లేని దుస్థితి. జెన్‌కో వంద‌ల కోట్ల బకాయిలు చెల్లించాలి. అడిగే నాథుడు లేడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స‌మ‌స్య‌లు ఏఐటీయూసీ మాత్రం క‌నీసం ప‌ట్టించుకోలేదు.

టీబీజీకేఎస్ వ్య‌తిరేక‌త క‌లిసివ‌స్తుందా..?
ప్ర‌తిప‌క్ష యూనియ‌న్‌గా ఏఐటీయూసీ కార్మికుల త‌ర‌ఫున పోరాటం చేస్తే అటు యూనియ‌న్‌కు మంచి పేరుతో పాటు కార్మికుల స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం అయ్యేవి. దీంతో ఆ యూనియ‌న్ త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌నే భ‌రోసా కార్మికుల్లో క‌లిగేది. కానీ, చాలా సంద‌ర్భాల్లో కార్మికుల త‌ర‌ఫున నిల‌బ‌డాల్సిన యూనియ‌న్ అటు వైపు దృష్టి సారించ‌లేదు. దీంతో ఆ యూనియ‌న్ ఒక ర‌కంగా నిర్వీర్యం అయిపోయింది. ఇక ఆ యూనియ‌న్ ఎదుట ఉన్న‌ది ఒక్క‌టే ఆప్ష‌న్‌.. టీబీజీకేఎస్‌పై వ్య‌తిరేక‌త. స‌హ‌జంగానే గుర్తింపు సంఘంపైన ఉండే వ్య‌తిరేక‌త‌తో పాటు ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త క‌లిసి వ‌స్తే వ‌స్తుంది. లేదంటే ఏఐటీయూసీ గెలుపు క‌ష్ట‌మే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like