ఇంద్ర‌క‌ర‌ణ్‌ను అడ్డుకోండి… అండ‌గా ఉంటాం

-ఆయ‌న‌కు మంత్రిగా ఉండే అర్హ‌త లేదు
-ఆత్రం స‌క్కులాంటి వారికి ప్ర‌జ‌లు బుద్ది చెప్పాలి
-అడ‌వి బిడ్డ‌ల హ‌క్కుల కోస‌మే నా పాద‌యాత్ర‌
-ధ‌ర‌ణిలో మ‌ళ్లీ కాస్తు కాలం పెట్టిస్తం
-గిరిజ‌నుల‌ను మ‌ళ్లీ అడ‌విలో తీసుకువెళ్లి హ‌క్కులు క‌ల్పిస్తాం
-సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌
-కొమరం భీం పోరాట స్ఫూర్తితో పోరాటం చేయండి
-ములుగు ఎమ్మెల్యే సీత‌క్క

Telangana Congress: ప్రశ్నపత్రాల లీకేజీ సర్వసాధారణమని మాట్లాడిన ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రిగా ఉండే అర్హత లేదని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాద‌యాత్ర‌లో భాగంగా ఆయ‌న కెర‌మెరిలో మాట్లాడారు. మంత్రి ఇంద్రకరణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే వరకు రాష్ట్రంలో ఎక్కడ తిరగకుండా యువత,నిరుద్యోగులు అడ్డగించాల‌ని, ఆయ‌న‌కు బుద్ధి చెప్పాల‌న్నారు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. రాష్ట్రంలో మరో మంత్రి ఇలా మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటే ఆయ‌న‌ను అడ్డుకోవాల్సిందేన‌న్నారు.

కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో లేకలేక ఒక నోటిఫికేషన్ వేసి ప్రశ్నాపత్రం లీకేజీ చేసి వాళ్లకు కావాల్సిన వారికి అమ్ముకున్నారని భ‌ట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే సక్కు రాత్రికి రాత్రే పార్టీ మారిండని అన్నారు. పోడు భూముల పట్టాలిప్పించడానికి అధికార పార్టీలోకి వెళుతున్నానని అన్నాడని, టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఒక్కరోజైనా పోడు భూముల గురించి మాట్లాడిండా…? అని ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో అడవి బిడ్డల హక్కుల గురించి మాట్లాడినవా? అడవి బిడ్డలకు పోడు భూములు ఇప్పించని నువ్వు ఎందుకోసం పార్టీ మారావ్..? అని దుయ్య‌బ‌ట్టారు.

గతంలో ఇచ్చిన పట్టాలకు కూడా కొత్త పాస్ పుస్తకాలు ఇప్పించని ఎమ్మెల్యేగా నువ్వుంటే ఏంటి? లేకుంటే ఏంటి? అని ఆత్రం స‌క్కుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అవకాశవాద రాజకీయాలు కోసం వెంపర్లాడే సక్కు లాంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత రూ. 18 లక్షల కోట్లు ఖర్చు చేశారు. తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్లు తెచ్చిన ప్రజల జీవితాల్లో ఏమి మార్పు రాలేదని, తెలంగాణ బతుకులు బాగు కాలేదని భ‌ట్టి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పాదయాత్రలో ఎవరి గుండె చ‌ప్పుడు విన్నా.. పుట్టెడు సమస్యలు వినిపిస్తున్నాయ‌ని అన్నారు. అడవి బిడ్డల హక్కులను కాపాడటం కోసమే నా పాదయాత్ర అని స్ప‌ష్టం చేశారు. 9 సంవత్సరాలలో దేశ సంపదను అదానికి దోచిపెట్టిన మోడీ ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడిగా మార్చార‌ని అన్నారు. దేశ వనరులు సంపదను ప్రజలకు పంపిణీ చేయాలి… కానీ మోడీకి మిత్రులైన కార్పొరేట్లకు సంపదను పంచి పెట్టడాన్ని ప్రశ్నించిన రాహుల్ పై కేసులు పెడుతుండ్రని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల అవలంబించడంలో కెసిఆర్ మోడీ దొందు దొందేన‌ని… కేసీఆర్‌, మోదీల‌కు బుద్ధి చెప్పడానికి పాదయాత్ర చేస్తున్న అని భ‌ట్టి వెల్ల‌డించారు.

తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తామ‌న్నారు. ఏజెన్సీ గిరిజనుల బతుకుల బాగుకోసం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమిస్తామ‌ని హామీ ఇచ్చారు. అడవిలోకి తీసుకువెళ్లి హక్కులు కల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. గిరిజనేతరుల సమస్యలు తీరుస్తామ‌న్నారు. ధరణీలో కాస్తు కాలం పెట్టి భూమిపై హక్కు కల్పిస్తామ‌న్నారు. ఆదిలాబాద్ జిల్లాను దేశానికే తలమానికంగా అభివృద్ధి చేస్తామ‌ని వెల్ల‌డించారు.

ఈ స‌మావేశంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేసీఆర్, మోడీ భారత రాజ్యాంగం లేకుండా చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం, కేంద్రంలో మోడీ రాజ్యాంగం అమలు చేస్తుండ్రు అని దుయ్య‌బ‌ట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అడవి పై హక్కులు తీసివేసి గిరిజనుల సాంప్రదాయాలపై ఆంక్షలు పెట్టి హక్కులు కాలరాస్తోంద‌న్నారు. అడవి బిడ్డలను దోపిడీదారులు స్మగ్లర్లు అంటూ ముద్ర వేస్తోంద‌న్నారు. టిఆర్ఎస్ అణచివేతకు వ్యతిరేకంగా కొమరం భీం పోరాట స్ఫూర్తితో గిరిజనులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అడవిని అడవిలో ఉన్న వనరులను మనమే కాపాడుకోవాలని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోరుకునేది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అడవి పై హక్కు కల్పిస్తుందని సీత‌క్క స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like