ఎస్టీపీపీని దేశంలో అగ్రస్థానంలో నిలపాలి

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని దేశంలోనే అగ్ర‌స్థానంలో నిల‌పాల‌ని డైరెక్టర్‌ (ఈ అండ్‌ ఎం) సత్యనారాయణరావు చెప్పారు. ఎస్టీపీపీ, సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దేశంలోని 25 అత్యుత్తమ ప్లాంట్ల జాబితాలో 86.75 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) తో 9వ స్థానంలో నిలిచిందని, ఇదే ఒరవడి కొనసాగిస్తూ మున్ముందు మొదటి మూడు స్థానాల్లో నిలపాలని కోరారు. దక్షిణ భారతదేశం విద్యుత్‌ ప్లాంట్లలో ఎస్టీపీపీ మాత్రమే టాప్‌ 10లో చోటు దక్కించుకుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు వరకు 86.75 శాతం ప్లాంట్‌ లోడ్‌ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌)తో ఈ ఘనత సాధించిందన్నారు. ఎస్టీపీపీలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, పర్యావరణ చర్యలకు పెద్దపీట వేస్తూ అధిక విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్టీపీపీని నెలకొల్పిన తర్వాత ఇప్పటి వరకు 45,181 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయగా 42,466 మిలియన్‌ యూనిట్లను గ్రిడ్కు సరఫరా చేయడం ద్వారా రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడంతో తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోందని చెప్పారు.

కంపెనీ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా మూడు దశల్లో 300 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. మొదటి, రెండు దశల్లో 219 మెగావాట్లకు గాను 209 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం జరిగి విద్యుత్‌ ను గ్రిడ్‌ కు అనుసంధానం చేసినట్లు వెల్ల‌డించారు. ఈ నెల 10వ తేదీ లోగా రామగుండం-3 ఏరియాలో మిగిలిన 10 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి గ్రిడ్‌ కు అనుసంధానం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యుత్‌ శాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరపాలని సూచించారు. ఇప్పటి వరకు నెలకొల్పిన 209 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్ల ద్వారా 166 మిలియన్‌ యూనిట్ల సోలార్‌ విద్యుత్‌ ను ఉత్పత్తి చేసినట్లు, దీని వల్ల కంపెనీకి రూ.85 కోట్ల వరకు ఆదా జరిగినట్లు వివరించారు.

మూడో దశలో మిగిలిన 81 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటిని కూడా పూర్తి చేయడం ద్వారా కంపెనీకి ఏటా రూ.120 కోట్ల వరకు ఆదా అవుతుందన్నారు. సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఆవరణలోని జలాశయంలో ఏర్పాటు చేయనున్న 15 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ మే నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్నారు. దీనిలో తొలి విడతగా 5 మెగావాట్ల ప్లాంట్‌ ఈ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని, మిగిలిన 10 మెగావాట్లను మే నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్ లోయర్‌ మానేరు జలాశయంలో నెలకొల్పనున్న 250 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు సర్వే పనులు తుది దశకు వచ్చాయని అధికారులు డైరెక్టర్‌కు వివరించారు. దీనిపై డైరెక్టర్‌ మాట్లాడుతూ త్వరలోనే సర్వే పూర్తి చేసి టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తి చేయాలన్నారు.

సమావేశంలో ఎస్టీపీపీ చీఫ్‌ (ఓఅండ్‌ఎం) జె.ఎన్‌.సింగ్‌, జీఎం(ఈఅండ్‌ఎం) పిచ్చయ్య శాస్త్రి, జీఎం(సోలార్‌) సూర్యనారాయణ రాజు, జీఎం(సివిల్‌) రమేశ్‌బాబు, ఎస్వోటు డైరెక్టర్‌విశ్వనాథ రాజు, ఏజీఎం(ఎఫ్‌అండ్‌ఏ) మురళీధర్‌, డీజీఎం (ఈఅండ్‌ఎం) శ్రీనివాస్‌, సోలార్‌ కన్సల్టెంట్ మురళీధరన్‌, డీజీఎం (ఈఅండ్‌ఎం) ప్రభాకర్‌, డీజీఎం(సివిల్‌) రవి,ఇంజినీర్లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like