గొంతుకోసి… బండ‌రాయితో కొట్టి

-మంచిర్యాల జిల్లా ఇందారంలో దారుణ‌ హ‌త్య‌
-వివాహితపై వేధింపులే కార‌ణం
-అంద‌రూ చూస్తుండ‌గానే హ‌త్య‌
-వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్
-విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు

Murder: ప్రేమ పేరుతో వేధించ‌డ‌మే కాకుండా, అస‌భ్య ప‌ద‌జాలంతో మెసేజ్‌లు పెడుతున్న ఓ యువ‌కున్ని యువ‌తితో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు హ‌త‌మార్చారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివ‌రాల్లోకి వెళితే..

ముస్కె మ‌హేష్‌(28) అనే యువ‌కుడు బండిలో పెట్రోల్ పోయించుకుని వ‌స్తున్న క్ర‌మంలో ఓ కుటుంబం అత‌న్ని అడ్డ‌గించింది. ఇద్ద‌రు అత‌న్ని గ‌ట్టిగా ప‌ట్టుకోగా, మ‌రో ఇద్ద‌రు మేకలు కోసే కత్తులతో గొంతు కోసి బండ‌రాయితో మోది చంపేశారు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగినా ఎవరూ కూడా ఆపేందుకు ముందుకు రాలేదు. పైగా దీనిని వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పోస్టు చేశారు. ఇందారంలో మ‌హేష్‌కు మ‌రో యువ‌తికి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డిచింది. ఆమెకు మ‌రో వ్య‌క్తితో పెళ్లైంది. ఆ యువ‌తి భర్త సంవత్సరం కింద‌ట‌ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

దీంతో ఆమె త‌ల్లిగారింటి వ‌ద్దే ఉంటోంది. మ‌హేష్ ఫోన్ ద్వారా అస‌భ్య ప‌ద‌జాలంతో మెసేజ్‌లు పంపిస్తుండ‌టంతో ఆ కుటుంబం మ‌హేష్‌ను హెచ్చ‌రించింది. పోలీస్ స్టేషన్లో పలుమార్లు కేసు పెట్టినా, మహేష్ వేధింపులు ఆపలేదు. దీంతో ఆ కుటుంబం మంగ‌ళ‌వారం ఉద‌యం మాటువేసి మహేష్ ను రాళ్లతో కొట్టి చంపేసింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. మ‌హేష్‌ను చంపిన వారిని త‌మ‌కు అప్ప‌గించాల‌ని మ‌హేష్ బంధువులు ఆందోళ‌న‌కు దిగారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like