ఎండ‌దెబ్బ‌.. మృత్యువాత‌..

-ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాల్లో దంచికొడుతున్న ఎండ‌లు
-ఇప్ప‌టికే ఆరుగురి మృత్యువాత‌
-గ‌డిచిన 24 గంట‌ల్లోనే న‌లుగురు బ‌లి

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో దంచికొడుతున్న ఎండ‌ల‌తో జ‌నం పిట్ట‌ల్లా రాలుతున్నారు. ఎండదెబ్బ‌తో ఇప్ప‌టికే ఆరుగురు వ్య‌క్తులు మృత్యువాత ప‌డ్డారు. కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే న‌లుగురు మ‌ర‌ణించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ‌.ఇ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఇక్క‌డే నమోదవుతుండ‌టం గ‌మ‌నార్హం. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు కొమురంభీమ్ ఆసిఫాబాద్‌ నిర్మల్ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బతో మరణించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురి మృత్యువాత‌..
ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్ప‌టికే ఆరుగురు వ‌డ‌దెబ్బ‌తో మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా, గ‌డిచిన 24 గంటల్లో న‌లుగురు మృత్యువాత‌ప‌డ్డారు. మంచిర్యాల జిల్లా కాసిపేట సోమగూడెం న్యూ కాలనీలో కంచర్ల సమ్మయ్య అనే 55 సంల వ్యక్తి ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బతో మృతి చెందగా, అదే మండలం లోని లంబడి తండాకు చెందిన బానోత్ మోహన్ అనే 34 సం.ల యువకుడు వడదెబ్బతో మరణించాడు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పని చేస్తున్న రవి అనే యువకుడు వడదెబ్బతో మృతి చెందగా నిర్మల్ జిల్లా దిలవార్ పూర్ మండలం బన్సపల్లి గ్రామానికి చెందిన వనిత అనే వివాహిత ఉపాధిహామీ నిమిత్తం కూలిపనులకు వెళ్లి వడదెబ్బ సోకగా ఇంటికి చేరుకొని సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృత్యువాత పడింది .

44 డిగ్రీలు దాటింది..
మార్చి రెండో వారం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూర్యోదయం నుంచే గంట గంటలకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ మధ్యాహ్నం 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. దీంతో ఇంటి నుంచి జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇంట్లో ఉన్నా ఉక్కపోత భరించలేక పోతున్నామని, రాత్రి 10 గంటల వరకు కూడా వేడిగానే ఉంటుందని జ‌నం వాపోతున్నారు.

వారం రోజులుగా పెరిగిన తీవ్రత
వారం రోజులుగా జిల్లాలో 30 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 44కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు తప్పనిసరి అయితే తప్ప బయటకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా వైద్యుల సూచనల మేరకు తలకు చేతి రుమాలు, టోపీలు, టవల్స్‌ ధరిస్తున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు గిరాకీ పెరిగింది. ఇన్నాళ్లు మూలన ఉన్న కూలర్లు, ఏసీలను మరమ్మతులు చేసుకుంటున్నారు. రోడ్డుపై చేతివృత్తులు చేసుకునే కార్మికులు, దినసరి కార్మికులు, రెక్కాడితేకానీ డొక్కాడని రిక్షా, ఆటో కార్మికులు, వీధి వ్యాపారులు ఎండ తీవ్రతతోపాటు గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిర్మానుష్యంగా రోడ్లు
నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రాల్లో ప్రధాన వీధులన్నీ మధ్యాహ్నం వేళల్లో నిర్మానుష్యంగా మారుతున్నాయి. రద్దీగా ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ కార్యాలయాలు కూడా బోసిపోతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల స్వచ్చంద సంస్థలు రోడ్ల పక్కన చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీటిని ఉచితంగా అందిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో రెండు రోజులపాటు 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఆ తర్వాత క్రమేపీ పెరిగే అవకాశాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like