సూప‌ర్ వైజ‌ర్ పోస్టు రాకుండా అడ్డంకులు

-ఆన్‌లైన్‌లో త‌ప్పుడు స‌మాచారం ఎంట్రీ
=పోలీసులను ఆశ్రయించిన అంగన్వాడీ టీచర్
=ఆమెను అడ్డుత‌ప్పించేందుకే కుట్ర చేశార‌ని అనుమానం
=ఆరా తీస్తున్న పోలీసులు

అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్ పోస్టు ఏకంగా ఒక అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌కు సంబంధించిన వివ‌రాలు త‌ప్పుగా న‌మోదు చేసిన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఆమె పేరిట ఆన్‌లైన్‌లో త‌ప్పుడు స‌మాచారం ఎంట్రీ చేయ‌డంతో ల‌బోదిబోమ‌న‌డం ఆ టీచ‌ర్ వంతైంది. దీంతో త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆ టీచ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

రోజు రోజుకు ఆన్‌లైన్ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్బుల‌కు సంబంధించి ఇలాంటి వ్య‌వ‌హారాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఒక అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌కు సూప‌ర్‌వైజ‌ర్ పోస్టు రాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లో త‌ప్పుడు స‌మాచారం ఎంట్రీ చేశారు. ఇటీవల సూప‌ర్‌వైజ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేసేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రీక్ష నిర్వ‌హించింది. దీనికి క‌నీసం పదేండ్ల స‌ర్వీసు ఉన్న అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు అర్హులుగా నిర్ణ‌యించారు. వీరికి జ‌న‌వ‌రి రెండున ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అదే నెల‌లో రిజ‌ల్ట్ కూడా వ‌చ్చింది. దీనిపై కోర్టులో కేసు ఉన్నందున్న అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు అంద‌రూ త‌మ స‌ర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో పొందుప‌ర‌చాల‌ని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీచ‌ర్లు కొద్ది రోజులుగా అదే ప‌నిలో ప‌డ్డారు. త‌మ స‌ర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా భైంసా పట్టణం ఓవైసీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న మహిళ మంగళవారం రాత్రి నెట్ కేంద్రానికి వెళ్లారు. త‌న వివ‌రాలు, స‌ర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా, మీ బయోడేటా సర్టిఫికెట్స్ అన్నీ ఇప్ప‌టికే స్కాన్ చేసి పంపించార‌ని నిర్వాహ‌కులు స్ప‌ష్టం చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తప్పుడు సమాచారం పొందుపరిచి, ఎవరో కావాలని తనకి సూపర్వైజర్ ఉద్యోగానికి అర్హత లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే బయోడేటా నింపార‌ని బాధితురాలు వాపోయింది. తనది బి.సి బి కాగా, ఓపెన్ కేటగిరి అని, డేటాఫ్ అపార్ట్మెంట్ ఇయర్ కూడా ఒక సంవత్సరం తక్కువగా చేసి, పదవ తరగతి డీటెయిల్స్ సమాచారం కూడా తప్పుడుగా పొందుపరిచారన్నారు. త‌న‌ హాల్ టికెట్ నెంబర్ తో సైట్ ఓపెన్ చేసి తప్పుడు సమాచారం ఇవ్వ‌డంతో సూపర్వైజర్ పోస్ట్ రాకుండా నష్టం జరుగుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ సమాచారం అందించేందుకు సైట్ లో అభ్యర్థికి ఒకేసారి అవకాశం ఇచ్చారు. మ‌ళ్లీ తిరిగి సరి చేసుకుందామని అనుకున్నా సైట్ ఓపెన్ కాకపోవడంతో బాధితురాలు వచ్చిన అవకాశాన్ని కోల్పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంబంధిత శాఖ డైరెక్టరేట్ కి కాల్ చేసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. మీకు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, డిలీట్ ఆప్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన‌ట్లు ఆమె విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. త‌న‌కు అన్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నించిన వారిని ప‌ట్టుకోవాల‌ని, త‌న‌కు న్యాయం చేయాల‌ని బాధితురాలు బైంసా పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఐ సి డి సి అధికారిణి రాజశ్రీ కి కూడా వినతిపత్రం అందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like