మోదీ హ‌వా త‌గ్గ‌లేదు..

Modi: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని టైమ్స్ నౌ నవభారత్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హ‌వా త‌గ్గ‌లేద‌ని ఈ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ‘జన్‌ గన్‌ కామన్’ పేరుతో ‘టైమ్స్ నౌ- నవభారత్’ ఈ సర్వే నిర్వహించింది. దేశంలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం పక్కా అని వెల్లడించింది.

బీజేపీ కూటమికి 543 సీట్లకు 285-325 వరకు సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని టైమ్స్ నౌ-నవభారత్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 111-149 స్థానాలు వస్తాయని స్ప‌ష్టం చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తోందని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఏపీలో 25 స్థానాలు ఉంటే వైసీపీకి 24- 25 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. తెలుగు దేశం పార్టీకి 0-1 మధ్య సీటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో మూడో అతి పెద్ద పార్టీగా వైసీపీ అవతరించే అవకాశం ఉందని వెల్ల‌డించింది.

ఇక, తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి 37 శాతం ఓట్లతో 9- 11 మధ్య ఎంపీ స్థానాలు సాధిస్తుందని టైమ్స్ నౌ- నవభారత్ వెల్లడించింది. అలాగే తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీకి 29.2 శాతం ఓట్లు, బీజేపీకి 25.3 శాతం ఓట్లు వస్తాయని తేలిపింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 20-22 స్థానాలు, ఒడిశాలోని బీజేడీ పార్టీ 12-14 ఎంపీ సీట్లు గెలుస్తుందని సర్వేలో అంచనా వేసింది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఏకంగా 50.30 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది.

2019 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయ పార్టీల ఓటు షేర్‌తో పోల్చితే.. బీఆర్ఎస్ ఓటు షేర్ తగ్గుతుందని ఈ సర్వే పేర్కొంది. 2019లో టీఆర్ఎస్‌కు 41.29 శాతం ఓటు షేర్ దక్కింది. అదే బీజేపీ పుంజుకున్నట్టు ఈ సర్వే అంచనా వేసింది. 2019లో బీజేపీకి 19.45 శాతం ఓటు షేర్ ఉండగా ఈ సర్వే 25.30 శాతం ఓటు షేర్ లభిస్తుందని వివరించింది. కాంగ్రెస్ యథాతథ స్థితిలో ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. 2019లో 29.48 శాతం ఓటు షేర్ నమోదు చేసుకున్న కాంగ్రెస్ ఇప్పడు లోక్ సభ ఎన్నికలు జరిగితే 29.20 శాతం ఓటు షేర్ దక్కించుకుంటుందని టైమ్స్ నౌ నవభారత్ సర్వే వెల్లడించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like