త‌న కొడుకులా మ‌రొక‌రు చ‌నిపోవ‌ద్ద‌ని..

తన కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందటంతో ఆ పరిస్థితి మరొకరికి రాకూడదనుకున్నాడు ఆ తండ్రి. కొడుకు మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తూనే ఆ బాధని దిగమింగుకుంటూ హెల్మెట్ చేతపట్టుకొని హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వియం బంజర్‌ సోమ్లానాయక్‌కు చెందిన తేజావత్ సాయి ఈ నెల 8న ఖమ్మం బస్టాండ్ సమీపంలో బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో సాయి హెల్మెట్ ధరించకపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

కండిషన్ సీరియస్‌గా ఉండటంతో కుటుంబసభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి సాయి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు సాయి డెడ్‌బాడీని సోమ్లానాయక్ తండాకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకు వెళుతున్న సమయంలో అతడి తండ్రి తేజావత్ హరి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. మృతదేహం పక్కనే నిలబడి హెల్మెట్ చేతపట్టుకొని ఇది తలకు పెట్టుకుని ఉంటే నా బిడ్డ బ్రతికేవాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. తన బిడ్డలా ఏ బిడ్డా ప్రాణాలు కోల్పోకూడదని, బైక్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మట్ ధరించాలంటూ అవగాహన కల్పించాడు. కన్నబిడ్డ చనిపోయిన బాధలోనూ ప్రజల్ని చైతన్య పరిచే ప్రయత్నం చేసిన తేజావత్ హరిని స్థానికులు అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like