త‌ప్పెవ‌రిది..?

-స‌స్పెండ్ చేసి ప‌ది రోజుల్లోనే తిరిగి విధుల్లోకి ప్ర‌త్యేక అధికారిణి
-పెద్ద ఎత్తున డ‌బ్బులు చేతులు మారిన‌ట్లు ఆరోప‌ణ‌లు
-రాజ‌కీయ అండ‌దండ‌లూ కార‌ణ‌మ‌ని గుస‌గుస‌లు
-మ‌రి విద్యార్థినుల భ‌విష్య‌త్ ఆలోచించారా..? అని ప్ర‌శ్నిస్తున్న జ‌నం

మంచిర్యాల : అభం..శుభం తెలియ‌ని చిన్నారులు త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆందోళ‌న చేశారు. తిన‌డానికి అన్నం స‌రిగ్గ పెడ‌త‌లేరని, కుళ్లిన కోడిగుడ్లు, ఉడ‌క‌ని అన్నం పెడుతున్న‌ని విద్యార్థినులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారుల ముందు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. దీంతో క‌న్నెప‌ల్లి ప్ర‌త్యేక అధికారి అమూల్యని స‌స్పెండ్ చేశారు. అది నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే అస‌లు డ్రామా అప్పుడే మొద‌ల‌య్యింది. ప‌దిరోజులు తిరక్కుండానే అమూల్య తిరిగి విధుల్లోకి వ‌చ్చారు. వ‌చ్చీ రావ‌డంతోనే తిరిగి విద్యార్థినిల‌ను వేధింపుల‌కు గురి చేయ‌డం మొద‌లు పెట్టారు. మీరు ప‌రీక్ష‌లు ఎట్లా రాస్తారో..? చూస్తానంటూ వారిపై మండిప‌డ్డారు. దీంతో విద్యార్థినులు బుధ‌వారం మ‌ళ్లీ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భ‌వ‌నం పైకి ఎక్కి ఆందోళ‌న నిర్వ‌హించారు.

అమూల్య ప‌దిరోజుల్లోనే వెన‌క్కి రావ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధుల హ‌స్తం ఉంద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో విద్యాశాఖ‌లో ఒక అధికారికి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ముట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో అనేక ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి.

1. క‌న్నెప‌ల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఎన్నో రోజులుగా విద్యార్థుల‌కు స‌రైన భోజ‌నం అందించ‌డం లేద‌ని విద్యార్థినుల ఆరోప‌ణ‌. మ‌రి నిత్యం ప‌ర్య‌వేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు..? నిద్ర పోతున్నారా..? లేక త‌మ‌కు ముడుతున్న ముడుపుల‌తో నిద్ర న‌టిస్తున్నారా..?

2. విద్యార్థుల ఆందోళ‌న ఫ‌లితంగా ప్ర‌త్యేక అధికారి అమూల్య‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప‌ది రోజుల్లోనే ఆమె విదుల్లోకి ఎలా వ‌చ్చారు..? విద్యాశాఖ‌లో ఒక అధికారికి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ముట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి..? ఇది నిజ‌మ‌నే అనుకోవాలా…? కేవ‌లం ప‌ది రోజుల్లో స‌స్పెండ్ అయిన ఆమె వెన‌క్కి ఎలా వ‌స్తారు..?

3. ఆమెకు మ‌ద్దతు చెప్పిన రాజకీయ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సైతం ఏమైనా ముట్టాయా..? లేక‌పోతే పేద విద్యార్థిని వైపు ఉండాల్సిన మీరు వారిని వేధించిన అధికారి వైపు ఎందుకు ఉన్నారు..? ఇందులో మీ స్వార్థం ఏంటి..?

4. మంచి విద్య, భోజ‌నం అందించి పిల్ల‌ల‌కు మెరుగైన విద్య అందించాల‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం భావిస్తోంది. మ‌రి అదే పార్టీకి చెందిన మీరు అలాంటి అధికారిని ఎందుకు ప్రోత్స‌హిస్తున్నారు..?

5. ప‌రీక్ష‌లు ఎలా రాస్తారో చూస్తానంటూ స‌స్పెండ్ అయ్యి వ‌చ్చిన ప్ర‌త్యేక అధికారి పిల్ల‌ల‌ను బెదిరించిన‌ట్లు వారు చెబుతున్నారు..? త‌ర్వ‌లో జ‌ర‌గ‌బోయే ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో విద్యార్థులు టెన్ష‌న్ ప‌డి సరిగ్గా రాయ‌క‌పోతే దానికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారు…?

ఈ ప్ర‌శ్న‌ల‌కు జిల్లా స్థాయి అధికారుల నుంచి ప్ర‌జాప్ర‌తినిదులు, నేతలు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. డ‌బ్బులు ఉంటే చాలు ఏ ప‌నైనా చేయ‌వచ్చు అనుకునే ప్ర‌తి ఒక్క‌రు చిన్నారులు అడిగే వాటికి స‌మాధానం ఖ‌చ్చితంగా చెప్పి తీరాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like