తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్ల జరిమానా

Telangana government fined Rs.3,800 crore: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‪జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌) ఏకంగా రూ.3వేల 800 కోట్ల భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలను, గతంలో తీర్పులను అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలల్లో 3వేల 800 కోట్ల రూపాయలు ప్రత్యేక అకౌంట్ లో డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వ్యర్థాల నిర్వహణకు సత్వర చర్యలు చేపట్టి పురోగతిని తెలియజేయాలని తెలంగాణ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ.

1996లో మున్సిపాలిటీల్లో పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా చేయడం లేదని పర్యావరణ సురక్ష స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను 2014లో ఎన్జీటీకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్య నివారణ, 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలు, అక్రమ ఇసుక మైనింగ్ లపై చర్యలు తీసుకోవాలని స్వచ్చంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. వీటిలో రెండు విషయాలని ప్రస్తుతం విచారణకు ఎన్జీటీ స్వీకరించింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చి.. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నుంచి ఎన్జీటీ వివరణ కోరింది. ఇదే విషయంపై తెలంగాణ ప్రధాన కార్యదర్శిని కూడా హరిత ట్రిబ్యునల్ విచారించింది. ప్రధాన కార్యదర్శి ఇచ్చిన వివరణకు హరిత ట్రిబ్యునల్ సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే జరిమానా విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది ఎన్జీటీ.

ఇటీవలే.. పంజాబ్‌ ప్రభుత్వంపైనా ఎన్జీటీ కొరడా ఝలిపించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు పెద్దమొత్తంలో జరిమానా విధించింది. రాష్ట్రాల్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబధనలు, నీటి చట్టాల అమలును ఎన్జీటీ 2018 నుంచి పర్యవేక్షిస్తున్నది. మున్సిపల్‌ వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ రూ.2,080 కోట్లు ఫైన్‌ వేసింది.

మూడు వారాల్లో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్తాన్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ జరిమానా విధించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాలను అమలు చేయడంలో విఫలమైనందుకు రాజస్తాన్ ప్రభుత్వానికి రూ.3వేల కోట్లు, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడంతో మహారాష్ట్రపై రూ.12 వేల కోట్లు, వెస్ట్ బెంగాల్‌ ప్రభుత్వానికి రూ.3,500 కోట్ల జరిమానా విధించింది ఎన్జీటీ.

Get real time updates directly on you device, subscribe now.

You might also like