తెలంగాణలో మార్పు తథ్యం

-కుటుంబ పార్టీల‌ను త‌రిమికొడితేనే బాగుంటాం
-ఒక కుటుంబ పాల‌న కోసం తెలంగాణ ఉద్య‌మం జ‌ర‌గ‌లేదు
-అమ‌రుల ఆశ‌యాలు నెర‌వేర‌డం లేదు
-ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

తెలంగాణ‌లో మార్పు త‌థ్య‌మ‌ని, కుటుంబ పార్టీల‌ను త‌రిమికొడితేనే రాష్ట్రం,దేశం బాగుపడుతుందని ప్ర‌ధాని న‌రేంద్రమోదీ అన్నారు. తెలంగాణ‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణను టెక్నాలజీ హబ్ చేయాలని చూస్తుంటే.. కుటుంబ పాలనలో బందీ చేయాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్ర‌జ‌లు పట్టుదల, పౌరుషానికి మారు పేరని స్ప‌ష్టం చేశారు. తాను ఎప్పుడు వచ్చినా తెలంగాణ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని ఆనందం వ్య‌క్తం చేశ ఆరు. ‘తెలంగాణ ప్రజల అభిమానమే నా బలం. యువతతో కలసి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం.. ఇంత దూరం ఎండలో తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలకు ధన్యవాదాలు..’ అని తెలిపారు.

ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదన్నారు. తెలంగాణ విచ్ఛిన్నం చేయాలని చూసేవారు అప్పుడు.. ఇప్పుడు ఉన్నారని స్ప‌ష్టం చేశారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉంటే అవినీతి పెచ్చురిల్లుతుందన్నారు. పేదల సమస్యలు పట్టవన్నారు. ఒక్క కుటుంబమే తెలంగాణ అభివృద్ధిని నాశనం చేస్తోందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు తన నివాళులని చెప్పారు. ఉద్యమంలో వేలాది మంది మరణించారని.. అమరుల ఆశయాలు నెరవేరడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల కలలు సాకారం కావడం లేదన్నారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారం మార్పు తథ్యమని అన్నారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించాలన్నారు. తమ పోరాటం త్వరలోనే ఫలితాన్ని ఇవ్వబోతుందని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like